108
 

హ‌వ్వ, హ‌వ్వ వెద‌రుగొట్టం ఊదుకుంటూ ఉండే ప‌శుల‌కాప‌రినీ నీవు మోహిస్తూ ఉన్నది !  అయితే తల్లీ కాళ్ళు వంక‌ర‌టింక‌ర‌గా ఎందుకున్నాయి ? ఒక కాలు పొడుగూ ఒక‌కాలు పొట్టినా ఏమి ?

ఆ పాదాల‌ను వెక్కిరంచ‌కు. నీ క‌నులు పోతాయి. ఆ త్రివిక్రమావ‌తారుని గూర్చి క్షణ‌మైనా భావించ నీ శక్యమా ? చ‌తుర్ధశ భువ‌నాల‌నేలే జ‌గ‌న్నాధుడు నా మ‌నోహ‌రుడు, మార‌జ‌న‌కుడు...మానినీ మార‌స చోరుడు...

అమ్మా ! నీ చిత్తంవెలెనే చేతును. నాదొక చిన్నమాట‌. ప‌దునాలుగు భువానాల‌నూ చ‌క్క పెట్టాల్సి స్వామికి నిను క‌నులార చూచేటందుకైనా స‌మ‌యం ఉండ‌దే. మరి నీ ఆల‌న‌పాల‌న ఆ దైవానికే ఎరుక ! పోయి రానా, మ‌రి. సెల‌వు ద‌య‌చేయి....మ‌న్మధుడికి తండ్రా...? అంటే పెళ్ళయి బిడ్డలు కూడా ఉన్నవానికా మ‌న‌స్సర్పించావు ! ఇక‌, నేనేం చేసేది ?.....త‌ల్లీ, పోయివ‌స్తాను.

స‌ఖీ ! ఈ పూల‌పాన్పుపైన విశ్రమింప‌వ‌మ్మా. కోకిల‌మ్మ రాయ‌బార‌ము ఫ‌లించ‌క‌పోదు. నేడోరేపో నీ స్వామి నీచెంత‌కు రాక‌పోడు. స‌మ్మాళించుకో అంటూ స‌ఖియ‌లు గోదాదేవిని ఉద్భోదించినారు.

కైశికీవృత్తిలో మృద‌మ‌ధుర ప‌ద‌గ‌తుల‌తో మ‌ధుర శృంగార క‌రుణ ర‌స నిష్యంద‌ముగా లాస్యప‌ద్ధతిని న‌ట‌న‌మాడిన శుక‌వాణి ఆనాటి నాట్యాంత మంగ‌ళ హార‌తులందుకొనిన పిద‌ప య‌వ‌నికాంత‌ర్భాగ‌మున నిమేష‌కాల‌ము విశ్రమించి త‌న అంతఃపుర‌మున‌కు నిర్గమించెను.

మోహ‌నాకారుల‌లోకెల్ల మోహ‌నాకారుడైన‌ట్టిన్నీ, స‌హ‌స్రకోటి ఆదిత్యుల‌క‌న్న మిన్నయైన కాంతితో వెల‌గొందు దుర్నీరీక్ష్య తేజోవిరాజిత సుంద‌ర‌మూర్తి అయిన‌ట్టిన్నీ మ‌ధుర‌ముల‌న్నింటి కంటె మించిన మాదుర్యాతి శాయియ‌యిన ప‌ద‌పారిజాత మ‌క‌రంద ల‌హ‌రుల‌ను వ‌ర్షింప‌జేయున‌ట్టిన్నీ, ముజ్జ‌గ‌ముల‌ను స‌మ్మోహ‌ప‌ర‌వ‌శుల‌ను చేయ‌గ‌ల మ‌నోజ్ఞాకారుడైన మార‌జ‌న‌కునికై గోదాదేవి కుసుమాయుధునిచే 

పుష్పబాణ పీడిత‌యె వివ‌శురాలైన‌ది. కొన్ని మారులు అతిప్రలాప‌య‌గుచు, కొన్నిమారులు విల‌పించుచు, కొన్ని మార‌లు హ‌రి సాంగ‌త్యము ల‌బ్దమైన‌దానివలె హ‌సితాన‌న య‌గుచు, కొన్నిమారులు నిర్భర‌వేద‌నాంబువులో గ్రుంకువిడిన దానివ‌లె య‌తిదీన య‌గుచు, అస్థిర‌చిత్తమ‌యి చెలుల‌కు జాలిగొలుపుచు కాల‌వారాశిని త‌రింప న‌శ‌క్యమ‌గు చుండిన‌దాయెను.

శుక‌వాణి దేవి యొక్క మ‌న‌స్థితికూడ ఇట్లే ఉన్నందున ఆమె కూడ క్రుంగిపోయి, వ‌డ‌గాడ్పుక‌ల్లలాడు పుప్పల‌త‌వోలె, ఊగిపోవుచున్నది. కుమార్తెను చూచిన మ‌ర‌క‌త‌వ‌ల్లి అర్ధభోజ‌న‌ముల వ‌ల‌న న‌ట్లయిన‌ద‌నుకొన‌ది.

అచ్యుత‌నాయ‌నిం వారికి నాట్యరంగ‌ము శ్రీ‌రంగ‌మై, వైకుంఠ‌మైన‌ట్లుగ భాసించిన‌ది. అష్టాక్షరీజ‌ప‌ము అసంఖ్యాక‌ముగ చేసిన‌ప్పటికిన్నీ క‌లుగ‌ని అపూర్వానంద‌ము శుక‌వాణీ దేవి నాట్య ద‌ర్శనాన ల‌భ్యమౌతూ ఉన్నది. సంగీత నాట్యాది క‌ళ‌ల వ‌ల‌న భ‌క్తిమార్గమింత‌గా పూలు ప‌రిచిన‌ట్లు సుగ‌మ‌ము కాగ‌ల‌ద‌నుట‌కు ప్రభువుల వారి విర‌సిన అంత‌రంగ‌మే సాక్షి !


15

యువ‌ప్రభువులు, ర‌ఘునాథ నాయ‌కుల‌వారు కొన్నినాళ్ళుగా నిత్య కార్యక్రమాల‌లో పాల్గొన‌డం ప‌రిమితం జేసినారు. ఇతఃపూర్వం బంధుమిత్రాద‌ల కొక‌మారును, శ‌క‌సౌవీర అవంతీ గాంధ‌ర్వాది ఉత్తర‌దేశాల రాజ ప్రతినిధుల‌తోను రాయ‌బారుల‌తోను చ‌ర్చలు జ‌రిపేటందుకు ఒక మారున్నూ కొలువ‌ల‌య్యే వారు. ప్రాతఃకాలాన తిరువారాధ‌నం పూర్తి కావించుకొన్న తదుప‌రి బ్రాహ్మణోత్తములు ప‌ఠించే రామాయ‌ణ భాగ‌వ‌తాది దివ్యగ్రంధాల‌ను విని, వారికి తాంబూలాల‌లో బంగ‌రు నాణేల‌ను ద‌క్షిణ నుంచి స‌త్కరించేవారు. భోజ‌నానంత‌రం సాధు స‌త్కారాన్ని స్వహ‌స్తాల‌తో చేసేవారు.

ప్రస్తుత రాజ్య ప‌రిస్థితుల్లో ప్రభువుల‌వారికి ధ‌ర్మర‌క్షణ‌మే ప్రధాన క‌ర్తవ్యమైన‌ది. దుష్టుల‌ను , దుండ‌గుల‌ను అణ‌చ‌డ‌మే అష్టాక్షరీ జ‌ప‌మ‌న‌నం.  ప‌ర రాజ్య కాముకుల‌కు బుద్ధి గ‌ర‌వ‌డ‌మే ప‌ర‌దేవ‌తోపాస‌న స‌మ‌మైన‌ది.

త‌మ పితామ‌హులు చెవ్వప్ప నాయ‌నింవారి ప‌ర‌మ‌త స‌హ‌న‌మే ఈనాడు మ‌త‌క‌ల్లోలాల ఉప్పెన‌ల‌ను సృష్టిస్తూ ఉన్నది. త‌మ భుజ‌ద్వయ నిత్య నివాసిని అయిన శ్రీ ప‌రాక్రమ సంపన్న ల‌క్ష్మిని చూచి మ‌త్సర్య గ్రస్తులైన పాండ్య దేశాధిప‌తులు క్షణ‌క్షణ‌ము క‌య్యమున‌కు కాలుదువ్వుతూ ఉన్నారు.