ఇక రెండు ఘడియలలో యువప్రభువులు తంజపురికి పయనము కావల్సి ఉండెను. నిదురలేని రాత్రులు ఎన్నో గడచుటవలన శరీరమున శక్తి క్షీణించినట్లుగా, ఉత్సారహితంగా, భారంగా, అశాంతిగా ఉన్నది. అయినప్పటికీ దేశ పరిస్థితులకు తగినట్లుగా నడచుకోక తప్పదు. తంజపుర నగరిలో ప్రవేశించిన వెనువెంటనే శుకవాణీబాల దివ్యసముఖాన వ్రాలడమా లేక ప్రాతఃకాల నృత్యోత్సవ శుభసమయాన హృదయ పీఠస్థ మహాదేవి దివ్య దర్శనాన్ని చేసికొవడమా ?
రఘునాథ యువప్రభువులీ సందిగ్ధడోలికలలో ఊగుతూండగా ఒక్క మారు భేరీ భాంకారాలు, కాహళులు, శంఖారావాలు, యుద్ధనగారాలు, అశ్వపదఘట్టన ఘోషలు, యోదల ప్రళయగరనలు, గజఘీంకారాలు శ్రవణ భేరిని హోరెత్తించినవి. క్షణాలలో హాహాకారాలు మిన్నుముట్టుతూ ఉన్నవి. యువ ప్రభువుకు కనురెప్ప మూసి తెరిచేలోపున కవచాన్న ధరించి, కెంపుల పిడిగల వజ్రాయుధ తుల్యమైన అజేయమైన మహాకరవాలాన్ని కటికి బిగించి, ఒక్క అంగలో రామభద్రాశ్వాన్ని అధిరోహించి, కలహము జరిగే తావునకు హుటాహుటిగ జేరుకొన్నారు. అన్నమరాజు ఇట్టి పరిస్థితిని ఎదుర్కొనడానికి అప్రమత్తంగా ఉన్నందున సేవలను సర్వసంసిద్ధం చేసే ఉంచినాడు. అళగిరి నాయకుడు, చిన్నితంబి మొదలారి, చిదంబరదాసు మొదలైన మహావీరులు యువప్రభువులకు వలెనే వాయువేగాన వచ్చి వ్రాలినారు.
రఘునాథ ప్రభువులు పాండ్యసేనను పరికించినారు. ముసిరి గ్రామాన మారువేషాలలో ఉన్న తన సేనకంటె రెట్టింపు ఉండవచ్చునని భావించినారు. వారి అశ్వబలమే పదివేలవరకు ఉండవచ్చును, రెండువేల గజయూధం. తమకు అశ్వగజ దళాలు సిధ్ధంగా లేవు తంజపురికి వార్తనంపు వ్యవధానమున్నూ లేదు. శత్రువుల నిచ్చటనే ఎదుర్కొనడమా ? తక్కువ బలముతో శత్రువు నెదుర్కొని ఓటమి పొందుట కంటె...? రఘునాథ ప్రభువుల మస్తిష్కము భారమైనది. ముఖ్యదళవాయిలను తక్షణమే వెనుకకు తిరగవలసినదని ఆజ్ఞాపనను దయచేసినారు. మహాపరాక్రవమోపేతులైన చోళ మహావీరులు మూడు యోజనములు వెనుకకు మళ్ళినారు.
పాండ్యసైన్యానికి జయలక్ష్మి లభ్యమైనంతగా ఆనందం కలిగినది. ఉత్పాహంతో, జయజయధ్వానాలు చేస్తూ, ఉరకలువేస్తూ, తంజపుర రాజ్యాన్ని వశము చేసుకొన్నట్లు కలలుగంటూ అత్యంతార్భాటంతో ముందుకురికినారు. అశ్వదళాలు రేగించిన ధూలి మధ్య కనకాంబరవర్ణ పట్టువస్త్రంపై స్వర్ణమీస చిహ్నంగల పాండ్యరాజుల మీనకేతనము ఎగురుతూ ఉన్న రధంపైన, స్వయంగా ముత్తువీరప్ప పాండ్యధరాధినాధులే ఆశీనులై ఉన్నారన్నసత్యాన్ని రఘునాథనాయకులు గమనించినారు.
ముత్తువీరప్ప బుద్ధి కుక్కతోక వంటిది. ఇప్పటికి రెండుమారులు తన చేతిలో పరాభవాన్ని రుచి చూచినప్పటికినీ, జ్ఞానోదయం కలగకపోగా మరింత మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. శత్రుసైన్యము రెండు యోజనాలు తంజపురి రాజ్యంలో ప్రవేశించినది. ముత్తువీరప్పనాయకులు మహా దర్పంతో ముందుకుసాగి వస్తున్నారు.
వెనకకు మళ్ళిన చోళసైన్యం ఒక్కుమ్మడిగా చక్రవ్యూహంతో పాండ్యసేనను చుట్టుముట్టింది. ఇరుసేనల మధ్యన ఆరుబారల వ్యవధి ఉన్నది. మొదటివరుసలో అన్నమరాజు ఈటెగాండ్రను నియమించినాడు. ఇనుప త్రిశూలములతో ఉన్న వాడియయిన బల్లాలను గురి తప్పకుండా విసరడంలో వీరు అత్యంత నైపుణ్యం కలవారు. పాండ్య సైన్యాలకు ఈ ప్రకారమైన ఎదుర్కోలు అనూహ్యమవడం వలనవారు ఒరలలోని కత్తులను వెలికి తీసె లోపుననే నేల కరపవలసి వచ్చింది.
అశ్వదళాలను సైన్యము మీదకు దౌడు తీయించి కాల్బలాన్ని అణగ ద్రొక్కాలని పాండ్య సైన్యాధిపతులు పన్నిన వ్యూహాన్ని అళగిరి నాయకుడు వమ్ము చేసినాడు. కనులకు కనిపించనంత వేగాన వర్షపాతమువలె వచ్చి పడుతున్న విషలిప్త బాణాలను పాండ్యులు తప్పించుకొనలేకపోయిరి. ఎటులో తప్పించుకొని ముందుకురికిన అశ్వాల ముంగాళ్ళను నరకగల అరివీర భయంకరులు రెండవ వరుసలో నుండి క్షణాలలో అశ్వాలను హతము చేసిరి. అశ్వారోహకులు తామధిరోహించిన అశ్వాల క్రిందనే అణగి నశించిపోయినారు.
వేంకటపతిరాజు నాయకత్వంలో చోళవీరులు కొట్టిన దెబ్బకు పాండ్య గజయూధం తునాతునకలై పోయినది. రఘునాథ ప్రభువులు శ్రుతువ్యూహాన్ని ఇరుచేతులా ఛేదించుకొంటూ పోయి, పాండ్య భూనాధులకావంత దూరాన తమ అశ్వాన్ని నిలిపి, వింటినారిని మ్రోయించినారు. ఆనారి నుండి శత్రు సమ్మర్ధన రాగం వినిర్గతం కాగా ముత్తువీరప్పకు నిలువెల్ల ముచ్చెమటలు క్రమ్మినవి. రఘునాథ ప్రభువు కోపఘూర్ణాయితమైన అరుణ నేత్రాలను చూచి యమదర్శనమైనట్లుగా గజగజ వణికినాడు, పాండ్యుడు. |