నటన మాడుతున్న శుకవాణీ దేవికి, మహారాజులు ఆశీనులైన బంగారు సింహాసనము చెంతనున్న, రజిత సింహసనాన అధివసించి ఉన్న యువరాజులు శ్రీశ్రీశ్రీ రాఘునాథ నాయనిం వారి మెరుపుల చూపుల వల్ల కలువలహారం కంఠాన వ్రాలినట్లు భావన కలిగినది. ఆ చూపుల చల్లదనానికి ఒడలు పులకించి, అడుగు తడబడి హ్రీస్పందిత హృదయారవిందము ఒకింత ముకుళించగా వికసితవదన సరోజయైనది. నాట్యము పూర్తయ్యనదనే సూచనగా చెలియలు పాడిన మంగళ గీతమును విని, అంజలిహస్తమును పూని, తలవంచి, కన్నులరమోడ్చి, నతపార్శ్వయయి, దేవతావందన మాచరించినది. శ్రీశ్రీ తాతయరామానుజ దేశికులు, రాజగోపాల మన్నారునకు, చెంగమలవల్లికి, గోదాదేవిగ నర్తనము చేసిన శుకవాణి దేవికి బంగరు పళ్ళెరాన పచ్చకప్పురంపుటారతులద్దినారు. తదుపరి నవరత్న హారతులద్దారు.
స్వోచ్చిష్ట మాలికాసక్త గంధబంధుర జిష్ణవే
విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళమ్.
ప్రభువులకు పెద్దలకు నమస్కరించి శుకవాణీదేవి నిష్క్రమించినది.
యువరాజుల భవనానికి కళావతీదేవి, రామభద్రాదేవి లక్ష్మీదేవి విచ్చేసినారు. మువ్వురు యువరాణులను కుశలమడిగి తమ ప్రయాణములో విశేషములను హాస్యోక్తులతో వివరించి, మధుర నాయకులతో జరిగిన యుద్ధంలో విజయలక్ష్మి తమను వరించి ఏలాగున వైచినచో వర్ణించినారు యువరాజులు రఘునాథనాయకుడు.
రఘు : చూశారా దేవీ ! మీ మువ్వురితో ఆమె పోటికి నచ్చినది ?
ఎవరు, ప్రభూ ! ఎవరు ? కళావతీదేవి కలవరపడినది.
రఘు : విజయలక్ష్మి
ఆమె పాండ్యరాజ కొమరితయేనా, ప్రభు? లక్ష్మీదేవి మోమువంచి ప్రశ్నించినది.
రఘు : అవునవును. లక్ష్మీదేవి జింజిప్రభువులు కొమరిత అయినప్పుడు. విజయలక్ష్మి పాండ్యరాజుల కొమార్తెకాక మానునా ?
రామభద్ర : ప్రభువుల చమత్కారానికి అక్కగారూ, చెల్లెలుగారూ కూడ మోసపోయినారు. విజయలక్ష్మి అనేసరికి ఎవరో మరొక వనిత అనుకొంటున్నారు. పకపక నవ్వినదామె.
కళావతి : చెల్లెలుగారికి వచ్చినంత కవిత్వము మాకు రాదుకదా ! ప్రభువులను కావ్యనాయకులను చేసినారుకారా ! ఏదో పరధ్యానంలో మరొకరు పోటీకి వస్తున్నారని ప్రభువులు అనిన మాటకు బిత్తరపడినాను, క్షమించండి, ప్రభూ !
రామభద్రాదేవి యుద్ధవిశేషాలను కొసరి కొసరి అడిగి తెలిసికొన్నది.
కళా : ప్రభూ ! దైవప్రతిష్ఠలకు మమ్ములను కూడా తోడ్కొని పోవలసింది కదా !
రామ : ఇదివరలో విజయరాఘవపురంలో జరిగిన రామభద్ర ప్రతిష్ఠ సమయాన జరిగిన మహోత్సవాన్ని ఎంతో కన్నులపండువుగా చూచాము కదండీ, అక్కగారూ !
కళా : అప్పుడు లక్ష్మీదేవి జింజినగరములో వీరశైవాన్ని ఆచరిస్తున్నారు కాబోలు.
రఘు : దేవీ, రామసేతునగరాన శ్రీ రామచంద్రాలయము ఎంతో మనోజ్ఞంగా నిర్మింపబడుతూ ఉన్నది. ఆ మహోత్సవానికి రాణివారిని తప్పక తోడ్కొని పోగలము.
యువరాణులు మువ్వురితోనూ చతురలీలా వినోదకేళుల తేలియాడి, తాంబూల సేవనము చేసి, మనసులు తేలికకాగా, నవ్వుల పువ్వులలో ముంచి తేల్చి నిష్క్రమించినారు, రఘునాథ నాయకులు.
పెద్ద యువరాణీవారున్నూ, రామభద్రాదేవి యువరాణి వారున్నూ, లక్ష్మీదేవి యువరాణీవారున్నూ, వారివారి నగరులకు వెడలినారు.
శుకవాణిదేవి భవంతికి యువరాజుల వేంచేస్తూ ఉన్నార్న వార్తను పుష్ప సుంగంధాన్ని మోసికొని వచ్చిన గంధవహునిలా మోసికొని వచ్చిన దొక పరిచారిక. యువరాజుల వదనంలో మెరిసిన ప్రసన్న కాంతులను చూచినప్పుడు శుకవాణిదేవి హృదయానికీ రాక హెచ్చరికలు పంపించినది. సన్నని తెల్లచలువ వలువను కట్టి, సన్న వజ్రాలహారము చిరుముత్యాల ఒంట్లు ధరించి, చల్లని నవ్వుతో, వెన్నెలతో గుబాళించే మల్లెల గజమాలిక వలె విచ్చేసిన యువప్రభువును చూచి,వివశయై ఆహారాన్ని మెడలో ధరించి గుండెలకు హత్తుకొనాలని గాఢంగా అభిలషించినది. యువప్రభువులు వేంచేయగానే సఖియలు పరిచారికలు ఆ ప్రదేశం వీడి వెలడిపోయిరి. |