8
మరకతవల్లి కొమరిత చెంచులక్ష్మి రఘునాథ ప్రభునే తలుచుకొంటూ, తానా ప్రభువు ఎదుట గానపరీక్ష, నాట్యపరీక్ష అర్పింపవలసి వచ్చిన అదనుకు మన్నారు దేవునికి కోటి నమస్కారాలు అర్పించుకొంటూ, సర్వ విద్యలలో లోకాతీతుడైన ఆ ప్రభుని ఎదుట తానెట్లు పరీక్ష ఇవ్వగలనా అని లోన గజగజవడకుతూ ఇల్లు చేరుకుంది.
ఆ ప్రభువు తన్ను స్పృశించినాడు. ఏదో ఎంతో మధురమైన వరమాద్భుతత్వం ఆయన స్పర్శలో ఉంది. తన ఒళ్లు జల్‌జల్‌మని పోయింది. ఏదో వివశత్వం పొందింది. తానేమంత అందమైనదని ఆ దివ్యుడు తన్ను అంతగా, తన విషయం అంతగా కనుకొన్నాడు. సుశిక్షితులు అయ్యే బాలబాలికలు చదువుధోరణి గమనించడానికి అందరూ కుతూహలం కనబరుస్తారు. ప్రభువు విద్యాసరస్వతి. తన అదృష్టము కొలదీ వారడిగిన ప్రశ్నలకు తనకు ఉత్తరాలు బాగా వచ్చి ఉన్నవి. వారు తన్ను చాలా తెలివైన బాలిక అనుకొన్నారు. అంతమాత్రంచేత ! ఇరువది నాలుగేళ్ళున్నా అంత చిన్న వారులానే ఉన్నారు. ఎంత శాంతము, ఎంత గంభీరత, ఎంత రసజ్ఞత్వము, ఎంత సహృదయత్వము, ఎంత నెమ్మది ! మాట ఎంత మధురంగా ఉంది ! ఆ గొంతులో బాణి భరతఖండాన్ని దాటి నాకంవరకూ చేర్చివేయగలదు.
తాను చిన్నది. తనకా దివ్య పురుషుని క్రీగంట చూపైనా దొరక గలదా ? తన జన్మ పవిత్రమైతే, కళావతీదేవి రామభద్రాంబ దేవులకువలెనే తనకూ వారి దేశికత్వము లభిస్తుంది. కాళిదాస మహాకవి తనకు ఇష్టదైవం. కాళిదాసుని ప్రజ్ఞాబిందువు ఒకటైనను తనయందు ప్రవేశించుగాక ! అప్పుడు తాను...ఆ శారదావతారము మూర్తీభవించిన మనోహరత్వము, వీరత్వము, శాంతి తన్ను క్రీగంటనైనా చూడకుండా ఉంటాడా ? రఘునాథ ప్రభువు రచించిన భరతసార సంగ్రహము తానే స్వయంగా ముత్యాలకోవ వంటి అక్షరాలతో వ్రాసుకొన్నది, తీసి, ఓ మహాకవి ! ప్రాణేశ్వర ! నువ్వు నన్ను స్పృశించినంత మాత్రాన నా జన్ములు అన్నీ పవిత్రమయ్యాయి. నా తపస్సు నువ్వు నన్ను పలుకరిస్తావనీ, నన్ను స్పృశిస్తావనీ. అవి రెండూ ఫలించాయి. ఈ గ్రంధం ఎన్నిసారులో చదువుకున్నాను, ఎన్నిసారులో ! నాకు కంఠతా వచ్చును, ప్రభూ ! ఇది... ఆమె కన్నీరు తిరిగినది. మాట డగ్గుత్తిక పడింది.
మళ్ళీ ఆమె సమ్మాళించుకొన్నది. పంచకావ్య ప్రారంభంముందు తన గురువు గోవిందముఖి దీక్షిత బ్రహ్మ,
కావ్యం యశసేర్ధకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే
సత్యఃపర విర్వృతయే కాన్తాసమ్మితత యోపదేశయుజే
అని ఉపదేశించినారు. తానూ ఒక మహాకావ్యాన్ని రాయాలి. తాను చదివిన అన్ని కావ్యాలలో మేఘసందేశం పరమాద్భుత స్వప్నమాలిక, అమృత ప్రవాహము, ఆనందపధము.
ఇంతలో చెంచెలక్ష్మీ ! ఏమి చేస్తున్నావు ? భోజనానికి రమ్మని అమ్మగారు వార్త పంపారు అని వృద్ధదాసి ఒకర్తు వచ్చి పిలిచింది. ఉలిక్కిపడి నిద్రనుండి చటుక్కున లేచిన దానివలె కూర్చున్న పీఠము నుండి లేచి, చెంచులక్ష్మి వస్త్రాలంకరణ గృహంలోకి మేఘంలోని మెరుములా పరుగెత్తింది. అక్కడ వస్త్రాదికాలు స్వయంగా మార్చుకొని స్నానమందిరంలోనికి పోయి కాళ్ళు మోము చేతులు కడుగుకొని, పరిచారిక అందిచు చేతి వస్త్రంతో తుడుచుకొని, భోజన గృహానికిపోయినది.
ఒక్కొక్క దినాన మూర్తెప్పనాయకులు తన ప్రియురాలితో కొమరితతో కలిసి భోజనం చేస్తారు. ఆయనతో భోజనంచేసే సపంక్తులైన బందుగులు, చెలికాండ్రు అందరూ మహా భోజనశాలలో భోజనాదులు నిర్వహిస్తారు.
ఇంటికిరాగానే రఘునాథనాయకుల ఆజ్ఞ తల్లికి వినపించి ఉన్నది చెంచులక్ష్మి.
ఆ విషయం భోజన సమయంలో భర్తను ఉద్దేశించి మరకతవల్లి,
ఈ దినము అమ్మాయికి పరీక్ష అయినది ప్రభూ !
ఏ పరీక్ష దేవీ !
సంస్కృతంలో
ఎవరు చేశారు ?
యువరాజులం వారు.
ఏమిటీ ! రఘునాధ నాయకులే !
అవును, స్వామి !
ఏమన్నారు ! |