తాను దొంగలను ఎదిరించి యుద్ధము చేసినందుకు ఫలితంగా చాలా భాగము సొమ్మూ, నగలూ, ఏనుగులూ, గుర్రాలూ దక్కించుకోగలిగాడు. ఇంతకూ తండ్రిగారికి ప్రేమస్థానమైన ఇంద్రుడు ఒక్కడూ దక్కితే ఇక ఏమి మిగిలినా ఏమి మిగలకపోయినా బాధలేదు. నీకుగాయాలు తగిలాయిరా ? ఏడుస్తున్నావా ? నన్ను చూడు, ఎన్ని చోట్లనుంచి రక్తం కారుతోందో ? నేను నీకులా కంటనీరు కారుస్తున్నానా ? అని ఏనుగును వెన్ను తట్టాడు, వేంకటపతి బండిలో నుండి కొన్ని తైలాలను తీసుకొని వచ్చి గానుగనూనె వేపనూనె కలిపి గుడ్డపేలికతో గాయాలను తుడచినాడు. చెట్లను , పొదలనూ వెదికి తనకు కావలసిన ఆకులను కోసికొని తెచ్చాడు. ఆకులను రెండు అరిచేతుల మధ్యన నలిపి, పసరుతీసి, కొన్ని చూర్ణాలను తైలాలను కలిపి ఇంద్రుని గాయాలమీద, తన అంగవస్త్రము చింపిన పేలికతో అద్దిన వెంటనే అది బాధతో గంతులు చిందులు వేసింది. ఓయ్ ! కొద్దిగా ఓర్చుకోరా ! మండితే మండింది. రేపీపాటికి గాయాలు తగ్గిపోతాయి ఏనుగు వెంటపరుగులెత్తుతూ మందును పూశాడు, వేంకటపతి.
అన్నయ్యా ! ఇక్కడెవరో మూలుగుతున్నారు. చూద్దువుగాని రా, ఎంత ఎర్రగా ఉన్నాడో ! బ్రతుకుతాడో లేదోకాని కొన ఊపిరి ఉన్నట్లుంది అని వేంకటపతిని తీసుకొని వెళ్ళాడు అన్నమరాజు. వేంకటపతి వెంటనే రాజూ ! ఇతడు మన దేశస్థుడులాగా లేడు. ఎవరైతేనేమి ప్రాణాపాయంలో ఉన్నవారిని నిర్లక్ష్యంగా వదలి వేయకూడదు. వెంటనే కంచు చెంబుతో నీళ్ళూ ఔషదాల భరిణా తీసుకొనిరా నేను ఇక్కడే ఉంటాను అన్నాడు.
అన్నమరాజు తెచ్చే మంచి తీర్థంగాని ఔషధాల పెట్టెగాని అవసరంలేకనే అతడు బరువుగా కనులెత్తి చుట్టూ ఒకమారు పరికించి, చివరి శ్వాసవిడిచినాడు. వేంకటపతి చేతిలో ఉన్న అతని చేయి నిశ్చలమైపోయింది. అంతటి వీరుడైన వేంకటపతి ఆ క్షణాన నిర్విణ్ణుడైనాడు.
తడు భారతీయుడు కాడు. సమురద్రాలు, కొండలూ, ఆరణ్యాలూ దాటుకొని వచ్చి ఇక్కడ తనువు చాలించాడు. ఎక్కడ పుట్టాడో, ఏమో ? జన్మమెత్తిన తరువాత ఎప్పుడో ఒకప్పుడు మరణించక తప్పదు. నడిమిని ఉన్న ఈ కాలంలో ఎన్ని ఊహలూ, ఎన్ని యెత్తులూ, ఎన్ని పైయెత్తులూ, అందరికన్న నేనే మిన్న అన్న అహంకారాలూ, అంతా నాకేరావాలి అన్న మమకారాలూ, ఆశలూ, బంధాలూ, ప్రేమలూ, కోపాలూ, తాపాలూ, పగలూ ఇవన్నీ ఇప్పుడేమౌతాయి ? వీని శరీరం క్రిమికీటకాల కాహారం కాక తప్పదుకాదా ! అన్నమరాజు మాటలువిని ఉలికిపడినాడు, వేంకటపతి. తన తమ్ముడు కూడ తన వలెనే యోచిస్తున్నట్లుంది. ఇదే కాబోలు శ్మశాన వైరాగ్యమంటే, అనుకున్నాడు వేంకటపతి.
రాజూ ! తుది క్షణాలలో ఇతడు నా చేతిని ప్రాణభయంతో గట్టిగా పట్టుకొన్నాడు. సముద్రంలో పోయేవాడి చేతికి గడ్డిపోచ దొరికినట్లు, వీనికి నా చెయ్యి అందిందేమో ! నేను ఓదార్పుగా వీని గుండెమీద రాచాను. వాడు నా చేతిని మరింత ఆత్మీయంగా బంధించాడు కన్నులలో తృప్తి తొణికిసలాడింది. పెదాలు చిరునవ్వు నవ్వబోయాయి కాని ఇంతలో చిలుక ఎగిరిపోయింది. ఏనాటి బంధమో నా చేతుల్లో ప్రాణం విడిచాడు. ఇంతకూ నేను వీనిని గాయపరచలేదు ఎలా మరణించాడు ? ఎవరు వీని వెన్నులో బాకుదించారు.
వారిలో వారికున్న పొరపొచ్చాలు తీర్చుకునేటందుకు గాను ఇలాంటి పని చేసి ఉంటారు.
అన్నమరాజు మాటలకు తన ఊపినాడు, వేంకటరాజు.
అన్నయ్యా ! నీవు ఈ దగ్గరిలో ఎక్కడైనా నీరు ఉందేమో చూసి స్నానంచేసి రావాలి. మృతదేహాన్ని ఇంకా అలా అంటిపెట్టుకొనే ఉన్నావు. వంటలూ, భోజనాలూ ప్రక్క మజిలీలోనే అంటున్నాడు. గంగన్న. మన వారు దొంగలదండు మళ్ళీ వస్తుందేమెనని భయపడుతున్నారులే ! అన్నయ్యా !
తమ్ముడూ ! వీనినిలా వదిలివేసి వెళ్ళిపోవడం ఎలాగ ? నా మనస్సంగీకరించకుండా ఉంది. కుక్కలూ నక్కలూ పీక్కుతినవా ? అనాధప్రేత సంస్కారం చేయడం చాలా గొప్పవని శాస్త్రాలు చెప్తున్నవి కావా ? |