శ్రీ రఘునాథులవారే స్వయముగా గురువులగు చున్నారు. సరియైన సమయము చూచుకొనివార్తను పంపగలరునుకొంటాను. కొంత రాజకీయ ప్రసంగానంతరము , జపసమయము కాగా లోనికి వెళ్ళి పోయినారు.
మూర్తెప్పనాయనిం వారికి సంతసించాలనో, పరితపించాలనో తెలయకుండా పోయింది. అమ్మాయి రాజగృహానికి వెళ్ళి విద్యలను నేర్చుకొని రావడమా ? యువరాజులవారు ఇచ్చటికి వచ్చి నేర్పిస్తారా ? ఇది ముఖ్య సమస్య అయినదా తల్లిదండ్రులకు. వారున్నా చెంచులక్ష్మి వలెనే మౌనము పాటించసాగినారు.
తంజపురీ పట్టణ పొలిమేర గ్రామాలలో అరాచకత్వము కొద్దికొద్దిగా తలయెత్తుతున్నట్లుగా చారులు వార్తలను చేరవేస్తున్నారు. విదేశీయులైన పోర్చుగీసుల యాగడములు నాగపట్టణమున హద్దుమీరుతున్నవి. అరణ్య సమీపాలలో ఉండే జనపదాలకు దోపిడిగాండ్ర బాధలెక్కువ కాసాగినవి. రాజులకు, మంత్రులకు, దళవాయిలకు చర్చలతోను, యుక్తులతోను కాలము సరిపోతున్నది.
శుకవాణి తనకికి విద్యాప్రాప్తి లేదు, అని నిరాశ నిస్పృహలకు లోనై మనసు పరిపరి విధముల యోచించుచుండగా కాలూ చేయీ ఆడక, ఏమి చేయుటకును పాలుబోక వీణియను తీసినది. ఎన్నినాళ్ళయిందో దానిని శుభ్రపరచి. పట్టువస్త్రముతో దుమ్ము దులిపినది. ఆనాడు కనకాంగి రాగమునకు శృతి చేసినది. నాలుగు నెలలయింది పట్టువస్త్రపు తాకిడికా వీణ కనకాంగిరాగంలోనే నిక్వాణాలు చేసింది. శుకవాణికాగీతము గుర్తునకు వచ్చినది.
ఇద్దరి మనసులు ఏకములైతే
ఒద్దను వారెవ్వరే సఖీ !
ఇంతకూ తనకీ వేదన దేనికోసం ? కేవలం విద్యార్జన కోసమేనా. మరేదైనా కారణం కూడా ఉందా ? ఈ పాటికి రెండు కావ్యాలు పూర్తి చేయగలిగేది. నాట్యంలో మరింత ప్రావీణ్యాన్నీ సంపాదించేది. సంగీత శాస్త్రాన్ని గురించి చెప్పనే అక్కరలేదు. కాని కాని మరింకేదో కూడా వేదన నిలువనీయడం లేదు. మరల వీణ కనకాంగిని రవళించింది.
ఇద్దరి మనసులు ఏకములైతే. ఇద్దరు....ఇద్దరు....ఎవరా ఇద్దరు ?
ఇంకెవరు ? తానూ - తన ...ఊ...తన...చెప్పవే మొహమాటం దేనికి ? సిగ్గు దేనికి ? నేనింకెవరికీ చెప్పను కాదా! ఏమో నాకు నమ్మకంలేదు...ఈ కళ్ళు ....ఈ కళ్ళు చెప్పకుండా ఉంటాయీ ! ఈ పెదవులు కదలకుండా ఉంటాయా ? ఏమె అయినా చెప్పేస్తున్నా, చెప్పేస్తున్నా ! ఊ...
వినవే ఓ మనసా !
వినతాసుత వాహనుడే
నా పాలిట మన్మధుడై
మదన గోపాలుడై
నామానస చోరుడై
అచ్యుత రఘునాథుడై
అలరించెను, వినవే !
నన్నలరించెను వినవే ! || ఓ మనసా || అని తనలో తానే పాడుకొని పాడుకొని అరచేతులలో ముఖం దాచుకొని సిగ్గుపడిపోయినదా బాల. తన నిర్లిప్తతకీ, నిరాశకీ, మౌనానికి, మనస్సే భాష్యం చెప్పగా ఆ నవయౌవనవతి ముఖసరోజం కలకల లాడుతూ వికసించిందినది. పెదవులు నవ్యరాగోజ్వల కాంతులను దీప్తించినాయి. ఉత్సాహంగా తల్లిచెంతకు పరుగిడి వచ్చినట్లే వచ్చింది తల్లిదండ్రులకు కుమర్తె ఆనందాన్ని చూస్తూంటే ప్రాణం లేచివచ్చినంత పనైంది.
అమ్మాయీ ! చెంచూ ! దేనికమ్మా ఆ తొందర ? ఏం కావాలి ? మరకతవల్లి కుమార్తెను అక్కున చేర్చుకొని ఆప్యాయముగా ప్రశ్నించినది.
ఏమీ లేదమ్మా..... మరే ...మరే....ఏదో చెప్పాలనే వచ్చాను కానీ మర్చేపోయానే.
పిచ్చితల్లి, మర్చిపోవడం ఏమిటే ! నీవు మహా పండుతురాలివని అమాత్యుల వారు సెలవిచ్చినారు కాదుటే ! పండితులకు మతిమరుపు ఉంటుంది ! కిలకిలా నవ్వింది, చెంచులక్ష్మి. పండితులకే మతిమరుపు ఎక్కువ అమ్మా ! అన్నది.
శుకవాణి ! ఎంత చక్కని పేను పెట్టారు తల్లీ, అమాత్యులు నీకు ! అన్నారు, మూర్తెప్ప నాయకులు కుమార్తె నవ్వులకు ముచ్చటపడిపోతూ. |