రామభద్రాదేవి శుకవాణీ యొక్క ముగ్ధ మనోహరాకారమును చూచి ముచ్చట పడినది. పాపము, చిన్నపిల్ల ! రాచనగరుకు వచ్చుటకు ఇదియే ప్రధమము. అందుకే అంతగా బిత్తరపోతున్నది. అనుకుంటూ చనువుగా ముందునకు వెళ్ళి ఆమె చేయి అంది పుచ్చుకొని, నాట్యవిద్య పూర్తియై నట్లేనా ? అని ప్రశ్నించినది శుకవాణీ బదులు పలుకక యువరాజువంక చూచినది. గానవిద్య ఎంతవరకైనది ? కళావతి ప్రశ్నించినది. బదులుగా శుకవాణీ చిరునవ్వు నవ్వి క్రీగంట ప్రభువును చూచినది. లక్ష్మీకుమారి కూడ కావ్య పఠనమెంత వరకు వచ్చినదిని ప్రశ్నింపరాదా ? అని మేలమాడినాడు, యువరాజు. స్వామివారికి ఆశ యెక్కువైనది. ఈ బాల సమాధానముగ మరియుకమారు మీ కనులలోనికి చూచుననేకదూ మీ ఆశ ! అని రామభద్ర నవ్వినది. శుకవాణి మరింత సిగ్గుతో కుచించుకుపోయినది.
కళావతి యొక్క వెడదకన్నులలో నువ్వు కళకళలాడీనది. రామభద్ర పారిజాత కుసుమములు గుబాళించినట్లు నవ్వినది. లక్ష్మీదేవి నగుమోము నిండుజాబిల్లి వలె వెలిగిపోయినది. శుకవాణి ఈ మువ్వురిలోనున్న గుణములనే గాక మరింకేవియో దివ్య ప్రేమ జ్యోత్స్నలను రువ్వుచున్నది.
మంగళవాద్యాల నడుమ, ఆగమవిదుల వేదఘోషలో భూనభోంతరాళాలు మారుమ్రోగునట్లు, భేరీ భాంకారములు నినిదించుచుండగా రఘునాథ నాయకులు పత్నులతో గూడి ఇందిరామందిర ప్రవేశము చేసినారు. వారికి వామభాగాన మువ్వురు యువరాణులు వెంటనంటిరాగా శుకవాణి రామభద్రకు రెండడుగులు వెనుకన నడిచినది.
శుకవాణి ఆ మహాభవంతి నిర్మాణ కౌశలమును చూచి విస్తుపోయినది. ఇచట కవిత్వమును గానము చేయవలెనట ! ఈ వేదికకు చుట్టును అనేక వందల మంది ఆశీనులై కావ్యగాన వినోదముననుభవింప వచ్చును. ఇది నాట్యానుకూలమైన దివ్యరంగభూమి. ఇది సంగీతకళా సరస్వతికి విహార స్థానము. నీలమణులు రవ్వలు రతనాలతో వెలిగిపోవు దివ్వెలు. గాలికి రవరవలు పోయే బంగరు మువ్వలపట్టు
పరదాలు ! క్రిందంతా చలువరాళ్ళు తెల్లని పాలసంద్రపుటలలను మరిపించు శితవర్ణ కుడ్యాలలో పద్మములవలె రాణుల వదనములు ప్రతిబింబించుచున్నవి. కళామర్మజ్ఞులకు, కవి, తార్కిక, వైయాకరణ, విద్యా పండిత ప్రకాండులకు, సకల శాస్త్ర కోవిదులకు, విప్రవరేణ్యులకు, సకల మతప్రవక్తలకు, సాగ్నిచిత్య సర్వతోముఖాతి రాత్రవాజపేయాది మహామాగక్రతులకు ఆధ్వర్యము నెరపగల ఋత్విజులకును, మంత్రసామంత దండనాధాది మహావీరులకును, సంగీత నాట్య వైణిక వాగ్గేయ కారులకు, వణిక్ర్శేష్ఠులకును, ప్రముఖులకును పరివేష్టించేందుకు అనువుగా ప్రత్యేకాసనముల నమర్చిన ఆ ఇందిరామందిర మహాసభా వైభవశ్రీలను చూచిన శుకవాణి మనస్సు పరవశఙంచిపోయినది. ఈ తావు వివిధదేశాల నుండి సందేశములను కొనివచ్చు రాయబారులకు ప్రత్యేకము.
పండితులు ఆశీరక్షతలను యువరాజు యువరాణుల శిరములపై జల్లినారు. కావ్యనాట్యగాన కళాకలాపములతో రాత్రి మొదటి యామము ముగుస్తుండగా వారితోబాటుగా విందు భోజనమున పాల్గొన్నది శుకవాణి. ఆమె ఈ లోకమున లేదు. ఏమి జరుగుచున్నదియు తెలియుటలేదు. రామభద్రకు కనుసన్న చేసినాడు ప్రభువు. కప్పురకోడిని కొసిరి కొసరి శుకవాణిచే తినిపించినది, రామభద్ర. సొజ్జపాయ సాన్నమును తినుమని పదేపదే చెప్పినది, కళావతీదేవి.
రఘునాథులు ఏదో ఆలోచనలో మునిగియున్నట్లును, శుకవాణి కనులలోనికి చూచుటకు ఉత్సాహపడుచున్నట్లునూ గ్రహించి రాజులు ఏకకాల మందు బహుకార్యమగ్నులు కారే ! అనుకొన్నది, లక్ష్మీకుమారి. రసదాడిపండ్లు, పనసతొనలు, ద్రాక్ష, ఖర్జూర, కదళీఫలములు, తేనెవైచిన తీయ మామడిపండ్లు శుకవాణి కేవలము కనులతో చూచినంతనే మహాతృప్తురాలైనది. వాటిని ఆరగించమని యువప్రభువు మరిమరి చెప్పినాడు.
మహారాణి మూర్తిమాంబాదేవి తన ముద్దు మేనగోడలిని రావించి పులికాట్ అద్దకపు కెంబట్టుపుట్టములను, సన్న వజ్రపుసరులను, గజనిమ్మ పండ్లను సువాసన భరితములై వివిధ వర్ణములతో శోభించు పుష్పమాలలను, కుంకుమ, జవ్వాది చందనాగరు కస్తూరికాది పరిమళ ద్రవ్యములనున కాన్కజేసి ఆక్కున జేర్చుకొని ముదముతో శిరమును మూర్కొని సాగనంపినది. యువరాణులు మువ్వురు స్నేహార్ధ్ర దృక్కులతో
మరల మరల రమ్మని ఆహ్వానించి వీడ్కోలు చెప్పిరి. |