కొందరు కిరాత యువకులు ఈ సైనికుల రాకను తమ ఏలిక కెరిగించుటకు ధనుర్విముక్త శరములవలె అతివేగాన పరుగిడిపోయినారు. వీరి రాకకై ఎదరు చూచుచున్న భిల్లనాయకుడు, కప్పన్నదొర, అతి వినయముగ భయభక్తులతో యువప్రభువు ముంగిట మోకరిల్లి, తన తాటియాకుల భవంతికి కొనిపోయినాడు. మృణ్మయపాత్రలలో తీయని పుట్టతేనెను, రసవంతములైన వివిధ ఫలములను వారి ముందుంచినాడు. వారు భుజించువరకు తాను చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు.
కప్పలదొర : ప్రభూ ! మనము పిలువనంపిన నాయకులందరూ వచ్చినారు. మీ ఆనతి ప్రకారము ఎవరు నావలను నిర్మించాలో ఎవరు ఏనుగులను పట్టాలో మేమంతా కలసి నిర్ణయించుకొన్నాము. చివరగా మీరొక్కసారి మాతో కూర్చుంటే చాలు...
అట్లే ! అన్నారు, రఘునాథనాయకులు.
కప్పలదొర, రఘునాథులు, వేంకటపతిరాజు ఆ భవంతిలోని ఒక విశాలమైన గదిలోనికి ప్రవేశించినారు. అప్పటికే అచ్చటకు కొందరు యువకులు వచ్చి ఉన్నారు. వారు వినయంతో ఒంగి రఘునాథులకు నమస్కరించారు. పిమ్మట వేంకటరాజుకు వందనాలర్పించారు. వారు భిల్లనాయకులు. నారాయణ వనాన్నుండీ, దిండిగల్లునుండీ, దక్షిణ ఆర్కాటు వనాలనుండిన్నీ, వారు అక్కడికి చేరుకొన్నారు. ఈ నాయకులకు కప్పలదొరపట్ల మిక్కిలి స్నేహం, విశ్వాసం ఉన్నాయి.
నీలగిరి కొండలమీద వేంచేసి ఉన్న నీలమ్మదేవి దక్షిణభారతావనిలో నివసిస్తున్న సర్వకొండ జాతులవారికిన్నీ ఆరాద్యదేవత. నీలగిరి ప్రాంతంలో నివసించే తోడాల కామె కన్నతల్లి ! ఇంటపుట్టిన ఆడబిడ్డ. ప్రతియేడు పాల్గుణపూర్ణిమ నాడు ఆ దేవికి జాతరచేసి కోళ్ళనూ, మేకలనూ, గొఱ్ఱెపొటేళ్ళనూ బలిచేస్తారు. పుట్టతేనెతోనూ, వివిధ ఫల వైవేద్యాలతోనూ ఆ దేవిని తృప్తి పరుస్తూ ఉంటారు. ఈలాగున చేయకపోతే పులులో సింహములో గుంపుగా వారి గూడెలపై దాడిచేసి, విరుచుకు తినివేస్తాయని నమ్ముతారు.
నీలమ్మదేవికి పూజచేస్తే, ఆచల్లనితల్లి చీమనికూడా వారిక జోలికి రానీయదు !
నీలమ్మ సంబరానికి దేశం నలుమూలల నుండేగాక సరిహద్దులలో నున్న పొరుగు రాష్ట్రాలలో నివసించే గిరిజనులు కూడా విధిగా వచ్చి తమ తమ మొక్కుబడులు చెల్లించుకొనిపోతూ ఉంటారు. మధ్య భారతము నుండి గోండులు, మహారాష్ట్రము నుండి భిల్లులు నల్లమల కొండల నుండి చెంచులు, ఓఢ్రదేశము నుండి గదబలు, ఉత్తర కళింగము నుండి సవరలు, రాయలసీయ దక్కను ప్రాంతాల నుండి లంబాడీలు, చెంచులు, మన్నెం నుండి కోయలు, కొంకణతీరం నుండి ఇరువలు, పాండ్య దేశాన్నుండి కళ్ళర్లు తరలివచ్చి, స్థానికంగా నివసించే తోడాలు, మన్నాడీలు వడయర్లు, కున్నవర్లు మున్నగువారితో కలిసిమెలసి నాట్యం చేస్తారు. సర్వసాధారణంగా తోడాజాతులకు నాయకునిగా ఉండే యువకుడే నీలమ్మతల్లికి ప్రధానార్చకునిగా కూడా వ్యవహరిస్తాడు. ఈ నాయకుని పొరుప్పన్ అనిగాని వేశ్వన్ అనిగారి పిలుచుకొంటారు. ఇతను భార్యను కోటిచ్చి అనీ, కురత్తి అనీ పిలుచుకొంటారు. సంబరాలకు వచ్చిన వారందరికీ అతడు పెద్దన్న, ఆమె పద్దెవదిన !
నీలాల పున్నమకు వచ్చిన గిరిజనుల వేషములు, భాషలు, అలంకారములు రకరకములుగా ఉన్నప్పటికినీ అందరూ ఒక్క కోన వారె అన్నట్లుగా కలసి మెలసి పోతారు. సంబరముతో అందరి హృదయాలు ఏకసాగరమవుతాయి. వంకీల జుత్తులవారు, బారు జుత్తులవారు, పొట్టిజుత్తులవారు, ముళ్ళజుత్తులవారు, సాదాజుట్టువారు, పొట్టిముక్కులవారు, కోటేరుముక్కులవారు, లిక్కి కన్నులవారు, పెద్ద కన్నులవారు, వెడల్పు మొగములవారు, పొడవు మొగములవారు, ఇలా వివిధ రకాలుగా ఉన్నప్పటికీ వర్ణం మాత్రం అందరిదీ ఒక్కటే, కాటుక నలుపు !
తోడాలు ఆ పౌర్ణమిని నీలాల పున్నమి అని పిలుచుకొంటారు. జాతర జరిగే వారందినాలపాటు అక్కడ శబర నాట్యాలు, కోలాటాలు, తప్పెటల పోటీలు జరుగుతూంటాయి. రకరకాల రంగుల పూసలు, చందనం కర్రరోళ్ళు, ఏనుగుదంతాల రోకళ్ళు కొండకోనలో దొరికే మెరిసే రంగుల రాళ్ళు, వివిధ పుష్పాల నుండి సేకరించిన తేనియలు, పుష్కలంగా లభిస్తాయి. వెదురు బియ్యంతో వండిన సన్నని దారాలవంటి మురుగులు అనే కమ్మని పిండి వంటకమును అక్కడ ఎక్కుకగా అమ్ముతారు. ఒక కొండమీద ఆవగింజ ప్రయాణాన గురువింద పూసలు దొరికితే మరొకచోట పెద్ద ఉసిరిక కాయకన్న పెద్దపూసలు దొరుకుతాయి. నెమలి కన్నులు, బారుటాకులు, అడవి పసుపు, నెమలి పురిదండలు, లాక్షారసము, పచ్చి కస్తూరి, జవ్వాది మొదలైన వస్తువులను ఒకరికొకరు కానుక చేసికొంటారు. ప్రతి ఏటా కలుసుకున్నప్పుడు ఆత్మీయంగా ఆలింగనం చేసికొని, ఆపేక్షను వెల్లడించుకొంటారు. |