కడకు మంచినీళ్ళు అమ్మే అలివేలు కూడా అతనికి నీటి చుక్కైనా రాల్చకుండా విసవిసలాడుతూ వెళ్ళి పోయింది. క్రిందికి వెళ్ళి అన్నీ తెచ్చుకోవడం పున్నెడికి ఇష్టంకాలేదు. తన చోటుపోతుంది. నెలకు పదిరూపాలయు పెట్టి ఆ మెట్టును అతడు గుత్తకు తీసికొన్నాడు. తిండీ నీరూ లేకపోయినా భరించగలడు. కాని అలివేలు తిరస్కారాన్నిఎలా భరించాలో అతనికి అంతుపట్టలేదు. తాను అన్నం తింటూంటే ఆమె కబుర్లు చెప్పేది. నవ్వుతూ తనకుండలో నీరుపోసేది. అలాంటిది అంత నిర్ధాక్షిణ్యంగా వెళ్ళిపోయింది.
అతడు అపురూపంగా దాచుకొన్న రూపాయల మూటను ఎవరో దొంగిలించారు.
ధనం పోయినందుకు అతనికి విచారం కలగలేదు. అలివేలంటే తనకెంత ప్రేమో ఆనాడతనికి తెలిసి వచ్చింది. ఈ ప్రేమ ధనం బరువు నాతడు మోయలేకపోయాడు. పాలుపంచుకోడానికామె చిరునవ్వు సాయమవ్వాలి !
ఆనాటినుండీ పున్నెడు ముష్టెత్తడం మానేశాడు. మాట్లాడడం మానేశాడు. తిండీ తిప్పలూ మానేశాడు. ఊరకే పడిఉంటున్నాడు. వారం రోజులయేసరికి కళ్ళలోకి కొనప్రాణాలొచ్చాయి. చివరికి కొండమీంచి దూకి చచ్చిపోవాలనుకున్నాడు. అప్పటికిగాని అలివేలు చల్లని చేతులాతని చేతిని అందుకోలేకపోయినాయి. తన మూలంగానే అతడాస్థితికి వచ్చాడని ఆమె తెలుసుకొంటుంది. పశ్చాత్తాపంతో రోదించింది. నువ్వు దాచుకొన్న డబ్బు వివరాలు కుప్పుస్వామికి చెప్తే, అతడే ఆ డబ్బును కాజేసాడంటుంది.
పున్నెడు ఫక్కుమని నవ్వుతాడు. డబ్బుపోతే పోయింది. అంతకు రెట్టింపు సంపాదిస్తాను. అని చెప్పి అన్నిటికన్నా ఆత్మీయమైన ఆమె మంచి మనసును అర్థం చేసుకొని, గుండెలకు హత్తుకొంటాడు.
ఈ కథలో బిచ్చగాళ్ళ మనస్తత్వాన్ని, వారివృత్తిలోని సాధకాబాధకాలనీ, గుట్టుమట్లనీ వెలికితీసిన రచయిత, ఏడుమైళ్ళపొడవునా యాచించుకొని జీవించే వారి జాబితా కొంత ఇస్తారు. కుష్టురోగులు, మాంత్రికులు, సన్యాసులు, గాయకులు తిరుమలేశ్వరుని కొలువు చేసే అయ్యంగార్లు, అయ్యర్లు, అయ్యలు కోతులతో పాటు ఈ బిచ్చకుల బృందాలు ఈ వివరణ ఈనాటికే కాదు, ఏనాటికీ చెక్కుచెదరని సత్యం.
సుబ్బన్న అనే ఒక నిర్భాగ్య కార్మికుని దరిద్రాన్ని వర్ణించే చిత్రకథ. నేల ఇందులో సుబ్బన్న దుర్భర జీవితాన్ని నేలతల్లితో మెరపెట్టుకొంటారు రచయిత. నేలతల్లికి ప్రియపుత్రుడు సుబ్బన్న. అందుకే ఆమెకూ అతనికి మధ్యన అడ్డమనేదిలేదు. ఓ నేలా ! మా తల్లీ ! నీకూ మా సుబ్బన్నకూ మధ్య చాపన్నాలేదు. నీకూ మా సుబ్బన్న దేహానికి ఒక చొక్కాగాని అద్దంలేదు. నీకూ మా సుబ్బన్నకీ మధ్య నీలోనుంచి తీసిన ఓ నాపరాయన్నాలేదు అంటారు. ఇలాంటి గర్భదరిద్రులను, శ్రామికులను భూమి పుత్రులంటారు రచయిత. సుబ్బన్నలాంటి వారు నేలలోంచి వచ్చారు. ఆకాశంలోంచి ఊడిపడ్డ కోటీశ్వరులు మూడంతస్తుల మేడలో ఉంటారుగాని అమ్మ ఒళ్ళో పడుకోలేదంటారు. ఈ పృధ్వీమాతకు సుబ్బన్న దీనగాధను వివరిస్తారు రచయిత. ఎన్నో కడగండ్లూ కష్టాలూ గడిచి పెరిగి పెద్దవాడౌతాడు. అతనికి ధనికుల ఇండ్లలో పనిచేసే అమ్మాయితో స్నేహంకలుస్తుంది. అప్పుడు అతనికి నేల తల్లిలోని రహస్యాలు అర్థమవుతాయి. ప్రకృతిని చూసి పొంగిపోతాడు. సుగంధాల కాతని హృదయం విశాలమవుతుంది. నేల తల్లీ ! నువ్వు వాళ్ళ ఇద్దరి మమాదానందమూ ఓర్వలేని మానవ కఠినత్వం కళ్ళ కనపడకుండా చీకటినీ, చౌపతీ ఇసుక అనీ, సందనీ, తూమనీ, పార్కనీ, ఆ మహానగరంలో వారికోసం సృష్టించావా తల్లీ అంటారు.
ఈ దాంపత్య ధర్మం సర్వమానవాళికి ప్రకృతి సిద్దమైనదే. మహానగరాల్లో పేవ్మెంట్లమీద సంసారాలీడ్చే వారి మీద కరుణసార్ద్రమైన, వ్యంగపూరితగాథ, నేల. ఈ కధ ప్రత్యేక తరహాకు చెందినది.
గర్భ దరిద్రులపై వీరు చూపిన నిర్భర కరుణా, కళాకారుల దివ్యకళా జీవితసృష్టీ, గర్భ దరిద్రులపై సానుభూతిపూరితమై, అవ్యాజ కరుణాపూరితమైన వీరి మనసూ, కళాకారులలో తానూ కళాకారుడై, సంధ్యా నృత్యదార్శినికుడై, శిల్ప ప్రజాపతియై, నాట్యపరమేశ్వరుడై వెలయించిన భావనావైదగ్థ్యమూ తాపసులలో తపస్వియై యోగులలో యోగియైచిదానంద రహస్యాలను వెల్లడించగల వీరి ఆత్మౌన్నతమూ వీరి కథలను నిష్పక్షపాతంగా విమర్శిస్తే గోచిరంచే యదార్థ విషయం.
మానవునికి మూడు దివ్య శక్తులున్నాయి. అవి చిత్తము, జ్ఞానము, ప్రేమ, ఈ మూడూ కలిసి మానవుని మనుషత్వం నుంచి దైవత్వానికి లేవనెత్తడానికి ప్రయత్నిస్తాయి. చిత్తము ఈశ్వరునితో ఏకీభవించినపుడు, మనిషి చేసే కర్మలన్నీ జ్ఞానంతో పరిసమాప్తమవుతాయి. జ్ఞానానికి ప్రేమ ముఖ్యము. ఐక్యములేక ఏకతాభావమువలన కలిగే ఆనందమే ప్రేమ. ఆనందమూలకమైన ప్రేమను తెలుసుకోవడానికి జ్ఞానమూ, జ్ఞానార్జనకు ప్రేమా అవశ్యాకాలు. పరిపూర్ణ జ్ఞానమే పరిపూర్ణమైన ప్రేమగా మారుతుంది. ఈ ప్రేమ ఎవరికి ? ఎవరిమీద ? అనే ప్రశ్న వస్త్తుంది.
మరి, స్త్రీ పురుష సంబంధమైన ప్రేమ మాటేమిటి ? స్త్రీ పురుషులు ఒండొరులు నెందుకు ప్రేమించాలి ? వీరి శక్తులు నెగిటివ్ పోజిటివ్ వంటివి. పురుషుడు అగ్ని శక్తి, స్త్రీసోమ శక్తి, సూర్యచంద్రనాడులే ఈ అగ్ని స్టోమశక్తులు రెంటి కలయికలవల్ల జనించే శక్తి సృష్టి. వీరిరువురూ అంతరంగంలో నున్న ప్రకృతికి బహిరాకృతులు. సృష్టిలో మొదట ఏర్పడినవి రెండు. ఆ రెండూ ఏకమైతేనే ఏకత్వ ముత్పన్నమయ్యేది. కావున రెండు కలిస్తే ఒకటౌతుంది. మొదట నున్నది ఒకటి కాదేమో ?
అగ్ని శక్తినీ సోమశక్తినీ కలిపేది ప్రణయం, మరలా ఈ ప్రణయాన్ని సుషమ్నగా తీసుకుంటే ఇదొక యోగమౌతుంది. అదే ప్రణయయోగ మౌతుంది.
స్త్రీ పురుష ప్రణయంతో ప్రారంభమైన ఈ ప్రేమ అనంత విశ్వరూపుడైన పరమాత్మపై ప్రేమగా భక్తిగా రూపాంతరం చెంది దివ్య భావనగా అవతరిస్తుంది. ఇదే మధుర భక్తి.
అట్టి దివ్య భావనకు దారితీసే సుందర ప్రణయ భావానికి బాపిరాజు గారు తమ ప్రతికథలోనూ పట్టం గట్టారు. ఒక సంగీత శాస్త్రజ్ఞుడు ఒక శిల్ప బ్రహ్మ ఒక నాటరాజు, మహాతపస్వి, యోగి, బౌధ్ధమతాభిమాని, ఒక రైతు, చిత్రకారుడు, కుంటివాడు, గుడ్డిపిల్ల, శ్రామికుడు, ధనవంతుడు, సౌందర్యవంతుడు, సౌందర్యంలేనివాడు, కుల, మత, జాతి,అంతర్జాతీయ భేదరహితంగా సర్వులూ, ఈ ప్రణయ సంద్రాన మునకలెత్తినవారే ! అందరూ ఈ మహాసాగరంలో సంగమించినవారే ! ఎన్ని మహాసంగమాలో, ఎన్ని సంగమేశ్వరాలో.
నీ దైవం వేషాలు వేసిరాడు
నీ దైవం అబద్ధాలు చెప్పడు
నీకు ఆస్తి లేదు ఆస్తులు ఉన్నాయ్.
- బాపిరాజు