మరకతవల్లి నగుమోముతో తండ్రీ కొమర్తెల సంభాషణను వింటూ వీణె తీవెలను గోటితో సన్నగా మీటుతూ ఉన్నది. అరణ్యాలలో వెదురు గొట్టాల నుండి గాలి దూసుకుపోతూ చేసిన చిరువేణునాదంలా ఈ సంభాషణ ఆమె హృదయాన్ని మరింతగా ఆహ్లాదపరుస్తూన్నది.
శుకవాణి తల్లిదగ్గరకు నడచి ఆమె అధివసించి ఉన్న ఎత్తయిన పీఠికకకు వెనుకకాపోయి తల్లిభుజముపై వ్రాలి గారాలు పోయినది.
అమ్మా ! అమ్మా ! ఆండాళ్ నృత్యానికి నాకు కొత్త ఆహార్యం కావాలే ? ఇది వరకువి సరిపోవటం లేదుగా ! అని రాగాలాపన చేసినది.
చెంచుతల్లీ ! నువ్విప్పుడు ఆలపించినది ఏ రాగమే ! విన్నట్లుగానే ఉందిగాని క్రొత్తగా కూడా ఉంది. అంటూ మరకతవల్లి. నిండు జాబిల్లి లా వెలిగిపోయే కొమార్తె మోమును చూసి, చుబుకాన్ని ముద్దుగా పుణికినది.
అమ్మా !....మరీ....ఇదీ.......ఆనందవర్ధని రాగమే !
ఆహా ! అలాగే ఆటలాడిద్దువుగాని, ఇలాటి రాగం ఏదీలేదని నాకు తెలియదనుకుంటున్నావు కదూ ! నీ మాటలు నమ్మడానికి నేనేం యువరాజులను కాను ! అయినా నీవు కవికోకిలవు. ఏవేవో అర్ధాలను ధ్వనింపచేయగలవు. మావి పాత చదువులు. మంత్రులూ రాజులూ మాకు విద్యాబోధ చేయనూ లేదు, చేస్తామని అననూలేదు.
శుకవాణీ చిన్నపిల్లలా సంబరంగా చప్పట్లు కొట్టినది.
అమ్మా ! చదువు రాదంటూనే ఎంత చదివావో చూడు ! చదువుకు ప్రాత చదువులూ క్రొత్త చదువులూ ఏమిటే ! ఇంతకూ నాకు కొత్త ఆహార్యం మాటేమిటమ్మా ?
ఇప్పుడే తెప్పిస్తాను, ఆండాళ్‌దేవి పెట్టుకొన్నట్లుగా నీకు రత్న పింజరిని కూడా చేయిస్తాను, సరేనా ? శిగపై తురుముకొనేందుకు వజ్రకొండె, ముత్తుకొండె కూడ కావాల్నా, చెంచుతల్లీ !
ఆ పేర్లన్నీ నాకు తెలియవుగాని, అమ్మా, నువ్విన్ని సార్లు శ్రీరంగం వెళ్ళి వచ్చావుకదా ! అక్కడ ఆండాళ్ తల్లికి ఏమేమి నగలున్నాయో అన్నీ నాకు చేయించు. మహారాజుల సమక్షాన నాట్యమాడాలంటే ఎన్ని హంగులుండాలో అన్ని హంగులూ ఏర్పాటు చేయించమ్మా.
మరకతవల్లి కనులు ఆశ్చర్యానందాలతో విచ్చుకొన్నాయి. చిన్న చెంపసరాలు అయినా అలంకరించుకోడానికి మారము చేసే కుమర్తె తనకై తాను సర్వాభరణాలను కోరుకొంటున్నది. రఘునాథ యువప్రభువుల ఆహ్వానాన్ని తిరస్కరించి మహారాజుల ఆహ్మానానికి సంతోషంతో గంతులు వేస్తూ ఉన్నది. ఇంత చిన్నపిల్లకీ పెద్ద యోచనలేమిటో ! అని అనుకొన్నదామె.
****
సర్వ హైందవ జాతికిన్నీ శిరోధార్యములైన చతుర్వేదముల యొక్క మహామహిమాన్వితమైన ఘనత ఖండా తరములను దూసుకొనిపోయి సర్వ ప్రపంచాన్నీ ఉర్రూతలూగించివేసినది. వ్యాపారార్ధమై హిందూ దేశమునకు వచ్చిన పోర్చుగీసు, డచ్చి, ఫ్రాన్సు, ఆంగ్లేయ పండితులను సంస్కృత భాష మైమరపింప జేసినది. క్రైస్తవ మతాచార్యులు సహితము సదాచార సంపన్నులైన వేద పండితులకు ధనాశచూసి వేద చౌర్యాన్ని చేయ పురిగొల్పినదీ భాష. కొందరు లౌకికులు మతాచార్యులిచ్చిన ధనరాసులను స్వీకరించి ఇవియే వేద గ్రంధములని మోసగించి, అన్యములైన సంస్కృత గ్రంధములను వారి కొసంగినారు. ఇట్లు మోసగింపబడిన వారిలో పాండ్యరాజుచే గౌరవ ఆదరములు పొందుతూ ఉన్నట్టిన్నీ, హిందూ సన్యాసి వేషము ధరించి సంస్కృత భాషను అభ్యాసము చేస్తూ, క్రైస్తవాన్ని బోధిస్తూ, సాధ్యమైనంతమంది హిందువులను తన వైపునకు సామదానభేద దండోపాయముల చేత వశులను చేసికొంటూ ఉన్నట్టిన్నీ సర్‌రాబర్ట డినొబిలీ అను మతాచార్యుడు కూడా ఉండెను.
వేదములు అపౌరుషేయములా, కాదా అన్న విచికిత్సవేద మతానుయాయులకు సహితము కలిగినది. వేదములు ఈశ్వర ప్రణీతములని శృతి, స్మృతి, పురాణమలు ఘోషించుచున్నవి. ఒక్క పురుషుని చేత వేదములు ప్రకటింపబడలేదు. పెక్కుమంది స్త్రీ పురుష మహాబుషులు అగ్ని, వాయువు, ఆదిత్యాది దివ్య శక్తులను యోగశక్తి చేత సన్నికర్షంచేసి, దివ్యదృష్టితో అనేక మంత్రాలను దర్శించగలిగినారు. అందువలనే బ్రహ్మ జ్ఞానులున్నూ, తపస్సంపన్నులున్నూ అయిన మహాఋషులు మంత్రద్రష్టలుగా ప్రస్తుతింపబడుతూ ఉన్నారు. |