గోవిందదీక్షితుల వారు శుకవాణీ బాలయొక్క శేముషీత్వాన్నీ, కళాకౌశలాన్నీ వర్ణిస్తూన్న సమయాన ఆమె శారదాదేవి యొక్క అనుంగు బిడ్డ అనినారు. ఆమె పలికితే కవిత్వము ఆమె నడిచెనా నాట్యం. శుకవాణి వీణె తీవెలు సవరించెనా నాదబ్రహ్మ నిరాకారుడై శ్రవణ గోచరుడవుతాడు. గోదాదేవి శ్రీరంగేశునకై వ్రతం చేస్తూ తన కోరికనంతా ముద్ద కట్టించి ప్రతి దినము ఒక పాశురంగా మలచి ఆ స్వామికి నివేదనం చేసికొన్నది. ధనుర్మాసం ముప్పది దినాలూ ముప్పది పాశురాలను అల్లి స్వామీని కొంగు బంగారంగా చేసికొన్నది.
శుకవాణీబాల ఈ ముప్పది పాశురాలను గేయమాలికగా అల్లి అభినయం చేస్తూ ఉంటే చూడగల్గిన కన్నులే కన్నులు, ఆ భాగ్యమే భాగ్యము.
అండాళ్ తల్లి మన కనులముందే నాట్యమాడుతూ ఉంటే శ్రీరంగం ఎందుకు, వైకుంఠం ఎందుకు ? అని మహారాజుతో గోవింద దీక్షితులవారు చెప్పినప్పటి నుండీ శ్రీశ్రీశ్రీ అచ్యుత నాయనిం వారి మనసు ధనుర్మాసమెప్పుడు వస్తుందా, అండాళ్ నాట్యమెన్నడూ చూడడమా అని తొందర చేస్తూ ఉన్నది.
కొమరుడు ఆ బాలికను ఇందిరామందిరానకు ఆహ్వానించినప్పుడు ఆ బాలిక ఆహ్వానాన్ని తిరస్కరించిన వైనమూ, యువప్రభువులు ఆమె రాకకై ఎంతగా అలమటించినదిన్నీ మహారాణీ వారికి గూఢచారిణులు తెలయజేస్తూ ఉన్నారు. మూర్తిమాంబ వారు మహారాజులకా వార్తలను విన్నవిస్తూనే ఉన్నారు. రఘునాథ నాయకులు తాము తలచినది చేయగల స్థిరచిత్తులే, మరి శుకవాణినేల రావించుకొన లేకపోయారో ! ఆ బాల వీరిని మించిన స్థిరచిత్త కావలయును !
శ్రీశ్రీశ్రీ అచ్యుతనాయనిం వారు లేఖకుని రావించి మూర్తెప్ప నాయనిం వారి ప్రణయ పుత్రిక శుకవాణీబాలకు ఒక ఆహ్వాన పత్రమును లిఖింపజేసి, రథముపై ఫలపుష్పలు గంధ ద్రవ్యాదులు, పట్టుపుట్టుములతో బాటుగ అంపించినారు. రాచనగరులో మదన గోప విలాసభవనాన వేంచేసియేన్న శ్రీశ్రీశ్రీ మన్నారుస్వామి దివ్యసన్నిధిని ధనుర్మాసంలో ప్రత్యూష సమయాన, అండాళ్ నృత్యము చేయుటకు మహారాజులు ఆదరాభిమాన పూర్వకముగ శుకవాణిని ఆహ్వానిస్తూ వ్రాయించిన శ్రీముఖమది.
చెంగావిరంగు పట్టువస్త్రముపైన స్వర్ణాక్షరాలతోనున్న లేఖను చదువుకొని శుకవాణి బాల మనస్సు ఉప్పొంగిపోయినది. యువరాజులు మారువేషాన ఆనాడు తమ గృహానకు విచ్చేసినప్పుడు తాను చేసిన కొంటె పనులకు ఆ ప్రభువుకినిసినాడో అన్న హృదయవేదనతో ఆ బాల కృంగిపోతూ ఉన్నది. స్వయముగా ఆహ్వానాన్ని అందించినపుడు తాను మూర్ఖమై తిరస్కరించినందులకా ప్రభువు ఆగ్రహించియే యుందురని ఆమె కుమిలిపోతూ ఉన్నది. అటు గురువులైన గోవిందులవారి శుశ్రూష కూడా దూరమైనది. యువప్రభువులు ఆహ్వానిస్తూ చాచిన చేతులను తాను త్రోసివేసినది. తనంతాను పోయి మనోహరుల దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొనే దారికానక, అంధురాలివలె కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ శ్రీముఖము కరదీపికలా గోచరించినది.
పట్టరాని ఆనందమూ ఉద్వేగమూ బేడిసమీనాలవంటి కనులలో ప్రతిబింబిస్తూ ఉండగా, నాన్నగారూ ! ధనుర్మాసమింకా ఇరవై దినాలు పైగానే ఉందికదండీ అన్నది. శుకవాణీ.
మూర్తెప్ప నాయనిం వారిని హృదయశల్యంలా బాధిస్తున్న సమస్యను శుకవాణఙ కనులలో కనపడుతూ ఉన్న ఆనందం ఇట్టే పారద్రోలినది.
నువ్వేమి నిర్ణయించుకొన్నావు తల్లీ ? అని తేలికైన మనసుతో ప్రశ్నించినారు.
శుకవాణి కిన్నెరమీటినట్లు నవ్వినది.
ఈసారి మనకి వచ్చిన ఆహ్వానము శ్రీశ్రీశ్రీ అచ్యుతప్ప నాయక మహారాజుల నుండి గదండీ ! ఇది మీరరాని రాజాజ్ఞ కనుక ఇక్కడ మన నిర్ణయాలకు తావులేదుకదా ! అయినా, నాన్నగారూ ! గతంలో నేను చేసిన తిరస్కారానికి సిగ్గుపడుతూన్నాను. యువప్రభువులు అన్యధా భావించారేమో !
నాకెంతో సంతోషంగా ఉంది తల్లీ ! ఇప్పటికైనా నీవంగీకరించావు. అదేచాలు.
నాన్నగారూ ! మీరూ అమ్మకూడా నాతో వస్తున్నారుగదండీ ?
అయ్యో వెర్రితల్లీ ! మళ్ళీ మొదటికొచ్చావూ ? ఇతర రాజబంధువులూ, నగరాధికారులూ, సైన్యాధ్యక్షులు ఏదినాన వస్తారో మేమూ అప్పడే వస్తాముగాని అక్కడే నీదగ్గర ఉండిపోకూడదమ్మా ! |