104
 

బ్ర‌హ్మ వైవర్త‌పురాణ‌మున గోపిక‌లు కృష్ణుని భ‌ర్త‌గా పొందుట‌కొక దివ్య వ్ర‌త‌మునాచ‌రించిర‌ని తెలిసికొనిన ఆండాళ్ తానునున ఆ వ్ర‌త‌మాచ‌రించిన‌ది. ధ‌నుర్మాస‌మున ముప్ప‌ది దిన‌ములున్నూ ఉషోద‌య స‌మ‌యాన శీత‌ల‌జ‌ల స్నాన‌మాచ‌రించి. శ్రీ కృష్ణదేవుని పుష్ప‌, గాన , నాట్యారాధ‌న‌ల‌తో సంతృప్తుని గావించి హ‌విష్యాన్న‌ము ఒక్క‌పూట మాత్ర‌ము భుజించిన‌ది. ఇట్టి మ‌హావ్ర‌తాన్ని ఆచ‌రించే దివ్య‌స‌మ‌యాన ఆండాళ్ విర‌హ‌భార‌మును భ‌రించ‌శ‌క్య‌ముగాక‌, హృద‌య‌మునా గోపికాలోలుని ప‌ద స‌న్నిధాన‌మున క‌ర్పించి దిన‌మున‌కొక దివ్య కీర్త‌న‌ము ర‌చించిన‌ది. ఈ వ్ర‌త‌మే కాత్యాయ‌న వ్ర‌త‌ము. ఆండాళ్ త‌ల్లి ర‌చించిన దివ్య‌పాశురాలే తిరుప్పావైగా ఒప్పారిన‌వి. నూట‌న‌లుబ‌దిమంది భ‌క్తుల మ‌హాగాధ‌ల‌ను నాచ్చియార్ తిరుమొళి అనుపేర గ్రంధ‌స్థ‌ము గావించిన‌దామె.

శుక‌వాణి మార్గ‌శిర‌మాసాన ఈ తిరుప్పావుల‌ను రాచ‌న‌గ‌రులోని మ‌న్నారుభ‌వంతిలో అభిన‌యించుట‌కు మ‌హారాజుల‌చే నాహ్వానింప‌బ‌డి యువ‌రాజుల‌చే త‌న‌కొర‌కు ప్ర‌త్యేక‌ముగ నిర్మింప‌బ‌డిన ఇందిరా మందిర భ‌వ‌నాన‌కు స‌ఖీస‌మేత‌ముగ విచ్చేసిన‌ది. నాట్య‌మున‌కు కావ‌ల‌సిన స‌ర్వ‌హంగులున్నూ మ‌ర‌క‌త‌వ‌ల్లీ దేవి పూర్తి గావించిన‌ది.

తిత్తిపోయుట‌కును, మృదంగ‌ము వాయించుట‌కును మాత్ర‌మే పురుషుల‌ను ఏర్పాటు చేసినారు. ముర‌ళిర‌బాబు ముఖ‌వీణె దండెబెంగు, వీణె మొద‌లైన వాద్య‌ముల‌కు స్త్రీల‌ను నియ‌మించినారు.

శుక‌వాణిని చ‌క్క‌గా అలంక‌రించుట‌కుగాను అలంక‌ర‌ణ శాస్త్ర‌మున నిపుణులైన‌, అంగ‌ర‌చ‌న‌లో నిష్ణాతులైన చంద్ర‌రేఖ‌, సారంగిణి అను ఇరువురు స్త్రీల‌ను చెంగ‌ల్ప‌ట్టు నుండి రావించినారు. న‌ర్త‌కి యొక్క దేహ నిర్మాణాన్న నుస‌రించి వారు చక్క‌ని మేనిపూత‌ను అతిస్వ‌ల్ప‌ముగా పూచినారు. శుక‌వాణీదేవి యొక్క మేలిమి బంగారుచ్ఛాకు కుంకుమ పుష్ప‌కేస‌ర‌ముల తోడ‌ను హురుముంజి ముత్య‌పు చూర్ణ‌మిశ్ర‌మ‌ము సుగంధ ప‌రిమ‌ళ ద్ర‌వ్య‌ముతో క‌లిపిన మైపూత పూచినారు. చెక్కిళ్ళ‌ల‌కు జ‌వ్వాది, పాద‌ముల‌కు ద్రాక్షార‌స‌ముతో పారాణి పెట్టినారు. అరుణ‌రాగంతో మెరిసిపోయే బింబాధ‌రాల‌కు తాంబూల సేవ‌న‌ము మ‌రింత దీప్తినొస‌గిన‌ది. దివ్యాంగ‌ న‌ల‌కుచిత‌మైన భూష‌ణ‌ముల‌ను, వ‌స్త్ర‌ముల‌ను శుక‌వాణిచేత ధ‌రింప‌జేసినారు. వెన్నెల వెలుగు వంటి తెలివ‌లిపెపు జిలుగు ప‌ట్టుపుట్ట‌ముపై నీలిజ‌ల‌తారుల‌వ‌ల్లె వాటు వైచినారు.

ఆనాటి అలంక‌ర‌ణ‌ముల‌న్నింటిలోనూ ఆమె కంఠాన శిఖ‌రాయ మాన‌ముగా మెర‌సిపోవుచున్న‌ది, అష్టోత్త‌ర శ‌త‌స‌ర ర‌జిత‌హార‌ము. నూలు పోగులో ప‌దార‌వ‌వందు ప‌రిమాణ‌మున ఉన్న నూట ఎనిమిది వ‌ర‌స‌ల ఆర‌జిత హార‌మును మ‌ర‌క‌త‌వ‌ల్లి దేవి ప్ర‌త్యేక‌ముగా చేయించిన‌ది.

చిట్టిత‌ల్లి న‌ట‌న‌మాటే స‌మ‌యాన బ‌రువైన హార‌ములు వ‌ల‌దు దేవీ అని మూర్తెప్ప నాయ‌నిం వారు ప్ర‌త్యేకించి హెర్చ‌రించి ఉండిరి.

మీ ముద్దుబిడ్డ సౌకుమార్య‌మును నేనెరుగ‌నా ? అని మ‌ర‌క‌త‌వ‌ల్లి చిరునవ్వు న‌వ్విన‌ది.

స్వ‌ర్ణ‌కాంచి, స‌న్న‌వ‌జ్రంపు షోడ‌శ య‌ష్ఠిక మ‌ర‌క‌త మేఖ‌ల‌తో శ్రోణిన‌లంక‌రించినారు. ముక్తాహార‌ము స‌న్న‌ముత్యాల వ్యాళ‌పంక్తి శృంఖ‌లిక‌ల‌తో పాటుగ యువ‌రాజుచే బ‌హూక‌రింప‌బడిన ప‌చ్చ‌ల‌హార‌ముతో కంఠాభ‌ర‌ణ‌ములు, వక్షో విభూష‌ణ‌ములు శుక‌వాణీదేవి యొక్క సౌంద‌ర్య‌చ‌చ్ఛాయ‌ల‌తో మ‌రింత‌గా వెలిగిపోతూన్న‌వి.
ఆండాళ్‌దేవికి మాత్ర‌మే ప్ర‌త్యేక‌ముగా చేయు కేశాలంకార‌ము శుక‌వాణికి విల‌క్ష‌ణ‌ముగా అమ‌రిన‌ది. కుడివైపుగా చుట్టిన చిన్నిశిగ‌కు వ‌జ్రాల జాల‌రుల‌ను ముత్యాల‌జాలును, ల‌లాట‌మందు న‌వ‌ర‌త్నాల పాపిట‌బొట్టు, ప‌ద్మాకార‌పు పిండీ ప‌త్ర‌ము, చూడామ‌ణి చంద్ర‌వంక‌, శీర్ష‌జోల‌క‌ము, శిఖిప‌త్ర‌ముల‌తో అలంకృత‌మైన ఆమె శిర‌స్సు బ్ర‌హ్మ‌వై వ‌ర్త‌పురాణ‌మున‌నున్న గోలోక‌మును తోపించుచున్న‌ది. స‌న్న‌గే దంగిరేకుల బారు జ‌డ మ‌న్మ‌ధ గురుడైన శ్రీ‌కృష్ణదేవుని హృద‌యాన గాఢ‌ముగా నాటుకొన‌బోవు మ‌ద‌న ధ‌నుస్సాయ‌క‌ముల‌వలె చూప‌ట్టుచున్న‌ది.

మ‌న్నారు దేవుని ఎదురుగా ప‌ట్టుప‌ర‌దాల మాటునుండి ఆగ‌రుధూప‌ముల మేఘ‌వ‌ర్ణ‌మా, ముద్ద‌క‌పురం పుటార‌తుల అరుణ‌రాగ‌మూ క‌న్ప‌ట్టుతూ ఉన్న‌వి. హంగుమేళ‌ములు స‌న్న‌గా మ్రోయ మొద‌లిడిన‌వి. ఇరువురు యువ‌తులు కోకిల స్వ‌నాన‌.