105
 

క‌ర్క‌టే ఫ‌ల్గుణ్యాం
తుల‌సీ కాననోర‌ద్భ‌వాం
పాండ్యే విశ్వంభ‌రాం గోదాం
వందే శ్రీ‌రంగ నాయ‌కీం, అని గోదాస్తుతిని చేసినారు.

మ‌ర‌ల నొక్క‌మారు హార‌తి గుప్పున వెలిగిన‌ది. తెర తొల‌గ‌గానే గుగ్గిల‌పు మంట‌ల బంగ‌రు వెలుగుల‌లో, సూర్య‌మండ‌ల మ‌ధ్య‌స్థ హిర‌ణ్య‌వ‌ర్ఱ సంశోభినీ క్షీర‌వారాసీ స‌ముద్భూత‌యైన శ్రీ మ‌హాల‌క్ష్మీదేవి య‌వ‌తార‌మైన సాక్షాత్ గోదాదేవీ దివ్య‌మంగ‌ళ విగ్ర‌హ‌ముతో అవ‌హిత స్థాన‌మున‌, శృంగార విలాస లీలా దృక్కుల‌తో, ల‌తా హ‌స్త‌ముతో నిల‌చి ఉన్న శుక‌వాణీ దేవి ప్రేక్ష‌కుల హృద‌యాల‌నొక మారు ఝ‌ల్లుమ‌నిపించిన‌ది. ఆమె పాణిద్వ‌య‌ము కుర‌వ‌క ప‌త్ర రాగ‌రంజిత‌మై విరిసిన మందార‌మువ‌లె ముద్దు లొల‌కించిన‌ది.

స్వ‌ర్ణ సింహాస‌నాన ఆశీనులైన మ‌హారాజుల హృద‌య‌ము వైకుంఠ ద‌ర్శ‌న‌మైన‌ట్లుగా తృప్తిజెంది అద్భుత ర‌సాన ఓల‌లాడిన‌ది. వారి మ‌న‌ము నిరంత‌ర నారాయ‌ణ స్మ‌ర‌ణ‌ముతో నిన‌దించుచుండ‌గా ఎదుట నారాయ‌ణిదేవి దివ్య‌హేల‌తో న‌ర్తించుచున్న‌ట్లుగా నాయ‌న‌కు తోచిన‌ది. ఆ మ‌హా ప్ర‌భువున‌కు శుక‌వాణి దేవి త్రిప‌తాక హ‌స్త‌ముప‌ట్టి స్వ‌ల్ప చ‌ల‌న‌ముతో నృప‌వంద‌న మాచ‌రించిన‌దే క‌నుప‌ట్ట‌లేదు. న‌ర్త‌కి చేయు నాట్య విన్యాస‌ములోని కౌశ‌ల్యంగాని, వాద్య‌ముల మాటున నినిదించు స‌ర్వ‌నాదాత్మిక‌మైన సంగీత‌ల‌హ‌ర‌లు గాని, మ‌ధుర కంఠ‌స్వ‌రాన ఆల‌పించుచున్న గేయ‌మాలిక‌లుగాని ప్ర‌భువు వారి నేత్ర‌ములకు శ్ర‌వ‌ణాల‌కు ఆన‌నేలేదు. అచ్యుత నాయ‌నిం వారి హృద‌యాన గోదాదేవీ స్మ‌ర‌ణ‌ము, క‌న్నుల‌ముందు ఉన్న మూర్తియు గోదాదేవిగానే భాసిస్తూ ఉన్న‌ది.

మ‌హారాజుల చెంత స్వ‌ర్ణ సింహాస‌నాన ఆశీనురాలై ఉన్న మ‌హారాణి మూర్తిమాంబాదేవికి అచ్చెరువుతో క‌నులు విచ్చుకొన్న‌వి. త‌న ముద్దుల మేన‌కోడ‌లింత‌టి సౌంద‌ర్య‌మూర్తియా ! ఇంత‌టి క‌ళా నిష్ణాత‌యా ! అని ఆమె అబ్బుర‌ప‌డిన‌ది. శుక‌వాణీ వ‌ద‌నాన వెలిగిపోయే దివ్య‌సౌంద‌ర్య దీధితుల‌ను క‌నురెప్ప‌వేయ‌క గ‌మ‌నించ సాగిన‌ది. యువ‌రాజు ఈమె కొర‌కు మందిరాన్ని నిర్మించినార‌ట‌. ఇందు వింత యేమున్న‌ది ? ఇటువంటి త్రిభువ‌నైక మోహిని పాదాల‌చెంత యావ‌ద్భోగాల‌ను ఉంచ‌డానికైనా సంకోచించ‌న‌వస‌రం లేదు.

యువ‌రాజుల సింహాస‌నం అనాక్ర‌మిత‌మై యున్న‌ది. యువ‌రాణులు మువ్వురు ఉచితాస‌నాల‌ను అధివ‌సించి ఉన్నారు. ఈ మ‌న్నారు స్వామి కేవ‌ల‌ము పాల‌కుల కొర‌కు మాత్ర‌మే వేంచేసి ఉన్నారు. ఇచ‌ట జ‌రిగే సంగీత నాట్య పురాణ కార్య‌క్ర‌మాలు రాచ‌కుటుంబం వారికిన్నీ, వారి బంధువ‌ర్గంలో వారికిన్నీ మాత్ర‌మే ప‌రిమితం. ఒక్క మహామాత్యులు మాత్ర‌ము ద‌య చేయ‌వ‌చ్చును. మహామాత్యుల‌కు రాచ‌న‌గ‌రులో ఏ భ‌వంతిలోనికైనా అన్నివేళ‌లా స్వాగ‌త‌మే.

యువ‌ప్ర‌భువులు విచ్చేయ‌లేదు. శుక‌వాణి హృద‌యం విల‌విల‌లాడిపోయిన‌ది. ప్ర‌భువులు త‌న‌పై ఆగ్ర‌హించినారా ? ఆమె మ‌న‌సు వివిధ‌ము లైన సంచ‌ల‌ముల‌కు లోనైన‌ది. శుక‌వాణీదేవి అంత‌రంగ‌ము భావోద్వేగ‌ము వ‌ద‌న‌ముపై ప్ర‌తిబింబించిన‌ది. గోదాదేవి స్థితి కూడ నాట్య‌మాడుతున్న శుక‌వాణి మ‌న‌స్థితివ‌లెనే ఉన్నందున‌, ఆమె అభిన‌యిస్తూ ఉన్న ఘట్ట‌ము అత్యంత స‌హజ‌ముగ నుండి చూచువారిచేత భ‌ళీ ! అనిపించుకున్న‌ది. మంగ‌ళంపాడి హార‌తి ప‌ట్ట‌గానే స‌భ‌కు న‌మ‌స్క‌రించి నిష్క్ర‌మించిన‌ది, శుక‌వాణి.

నాట్యాంతాన యువ‌రాణులు మువ్వురున్నూ అలంకార మందిరాన‌కు వెళ్ళి శుక‌వాణిని ఎంతో శ్లాఘించినారు. క‌ళావ‌తీదేవిన్నీ, ల‌క్ష్మీదేవిన్నీ నిష్క్ర‌మించ‌డినికి సంసిద్ధుల‌వుతూ ఉన్నారు. అప్పుడు, శుక‌వాణీ ! ప్ర‌భువులు నీ నాట్య కౌశ‌ల్యాన్ని పొగ‌డుతూ ఉంటే అతిశ‌యోక్తులేమోన‌ని భావించాను. నేను క‌నులారా చూచిన త‌రువాత నీ నాట్య కౌశ‌ల్యాన్ని య‌ధాత‌థంగా వ‌ర్ణించ‌డానికి ఎన్ని అలంకారాలు ఉప‌యోగించినా స‌రిపోవ‌ని గ్ర‌హించుకొన్నాను. అని రామ‌భ‌ద్రాదేవి చిరున‌వ్వుతో ప్ర‌శంసించిన‌ది.

శుక‌వాణి రామ‌భద్రాదేవి పొగ‌డ్త‌కు బిడియంతో ముడుచుకొనిపోయిన‌ది. యువ‌రాణీవారి క‌ళాభిమాన మంత‌టిది, అన్న‌ది త‌ల‌వంచుకుని.

నీవీనాడు తాంబూల సేవ‌నానికి మా భ‌వంతికి రావ‌ల‌సిన‌దే. రామ‌భ‌ద్రాదేవి శుక‌వాణి చేతుల‌ను అందుకొని అంగుళీయ‌క‌ముల‌ను ఆత్మీయ‌ముగ స‌వ‌రించిన‌ది.

త‌మ‌రు నన్ను క్ష‌మించ‌వ‌లయును. నేను దీక్ష‌లో ఉన్నాను. ఒక్క‌పూట దైవ ప్ర‌సాదాన్ని మాత్ర‌మే భుజిస్తాను.

మువ్వురు రాణులున్నూ చ‌కిత‌లై విచ్చిన క‌నుల‌తో శుక‌వాణిని చూచినారు. ఏమి దీక్ష ? క‌ళావ‌తిదేవి భృకుటి రవంత ద‌గ్గ‌రైన‌ది.