117
 

పసిబాలునిలా, హృద‌య‌భారాన్ని వెలిబుచ్చిన ప్ర‌భువుల కంఠాన తిరిగి రాజ‌సం తొంగిచూచిన‌ది.

శుక‌వాణిదేవీ ! గురుదేవులు నిన్ను నాకు శిష్య‌ను చేసినారు. రేప‌టి నుండి నీవు నా విద్యార్థినివి, నేను నీ గురువును.

అంగీకారంగా శుక‌వాణి త‌ల‌దించుకొన్న‌ది. యువ‌ప్ర‌భువులు నిష్క్ర‌మించిన అర‌ఘ‌డియ‌వ‌ర‌కు ర‌ఘునాథుల హృద‌యాన విరిసిన ప్ర‌ణ‌య‌కుసుమ  సుగంధం ఆమెను ఆక్ర‌మించుకొని అట్లే నిల‌చిపోయిన‌ది. క్ర‌మ‌క్రమంగా ఆ తావులు ఆమె ఆత్మ‌తో అల్లుకొని ఒకే రూపాన స్ధంభ‌వించిపోయిన‌వి.

శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ నాయ‌నిం వారి గురుత్వంలో స‌హజ ప్ర‌తిభా మూర్తి అయిన శుక‌వాణి దేవి శాస్త్ర పాండిత్య‌మ‌నే స్వ‌ర్ణానికి తావి అబ్బిన‌ట్ల‌యిన‌ది. ప్ర‌భువులు బోధించ‌క‌ముందే విష‌య‌గ్రాహ్యం చేసికొన‌డ‌మేకాక విష‌య గాంభీర్య లోలోతుల‌ను కూడ నిర్ధారించ‌గ‌ల బుద్ధి నైశిత్య‌ముతో యువ ప్ర‌భువుల మ‌న్న‌న‌ల న‌శేషంగా పొందిన‌ది. సూర్య భ‌గ‌వానుని వ‌ద్ద ఆంజ‌నేయుల‌వారు విద్య నేర్చుకొన్నంత వేగంతో స‌ర్వ‌శాస్త్ర రహ‌స్యాల‌నూ ఆక‌ళింపు చేసికొన్న‌ది.

గురువ‌న‌గా ర‌ఘునాథులే గుర‌వు.వ్యాక‌ర‌ణ, త‌ర్క‌, అలంకార శాస్త్రాదుల‌లోను, సంగీత నాట్య వీణానాద‌నంలోను, సంస్కృతాంధ్ర భాష‌ల‌లో క‌వ‌న మ‌ల్ల‌డంలోను ప్ర‌భువుల‌కు సాటి ప్ర‌భువులే. ఈ స‌ర్వ విష‌యాల్లోనూ ప్ర‌భువులు శుక‌వాణిని కూడ త‌నంత‌టి దానిగా తీర్చిదిద్దినారు.

శుక‌వాణీ ! భూపాల‌రాగ‌మెప్పుడు ఆల‌పించ‌వ‌లెనో ?

ప్రాతఃకాలాన‌. ప్ర‌భూ ! దేశాక్షి, దేవ‌గాంధారి, ధ‌న్యాసి, గౌరి, మందాళి, మాళ‌వ‌రాగాలేగాక‌, వీనితో జ‌న్య‌జ‌న‌క సంబంధాలున్న రాగ‌ముల‌ను కూడ ఆల‌పించ వ‌చ్చునండీ.

ఎందుచేత‌నో ?

ప్ర‌కృతి స‌మ‌స్త‌మూ రాత్రి స‌మ‌య‌మంతా విశ్రాంతి తీసికొని, ఉషఃకాలాన ఉద‌య‌రాగంతో లేచినప్పుడు ప్ర‌శాంత‌చిత్తంతో అల‌రారుతూ ఉంటుంది. మ‌న‌సున‌కెట్టి అల‌జ‌డీ లేకుండా ఉంటుంది. ఆహ్లాద‌క‌ర‌మైన సుంద‌ర వాతావ‌ర‌ణానికి అనువుగా సుంద‌ర‌మైన రాగముల‌నే గానం చేయాల‌న్న‌ది గాంధ‌ర్వ ల‌క్ష‌ణం ప్ర‌భూ ! ఈ రాగాలు హృద‌యానికి ఉల్లాసం క‌ల్గించ‌డ‌మే గాక ఉన్న‌త‌మైన భావాల‌ను కూడా క‌లుగ‌జేస్తాయి. మాన‌వ మ‌స్తిష్కంలో అణ‌గి మ‌ణ‌గి ఉన్న మూల ప్ర‌కృతుల‌ను ఉద్దీపింప‌చేసే శ‌క్తి సంగీత నాట్యాది క‌ళ‌ల క‌నంతంగా ఉన్న‌దండి.

మంచిది. ఇంకేయే వేళ‌ల‌లో ఏయే రాగ‌ములు ప్ర‌శ‌స్త‌ములైన‌వో చెప్పు.

కురంజి, సాహుళి, ఘంటారావ‌, రామ‌క్రియ‌, బిల‌హ‌రి, మ‌ల‌హ‌రి, ముఖారి, య‌మున‌, రేగుప్తి, భైర‌వి మొద‌లైన‌వి ఉద‌య సంధ్యానంత‌ర కాలాన ప్ర‌శ‌స్త‌మైన‌వండి. మేఘ‌రంజ‌ని సారంగ‌, భ‌ల్లాతి, మ‌ధ్య‌మావ‌తి, దేశి, నీలాంబ‌రి, మంగ‌ళ‌దేశిక‌, శ్రీరాగ‌ములు అవ‌ర్ణాహ‌మున ఆల‌పించ‌వ‌లెనండి. మెహ‌న‌, క‌ళ్యాని, కాఫీ, ఘూర్జ‌రి, శంక‌రాభ‌ర‌ణ‌ము, పూర్వి, వసంత‌రాగాల‌ను సాయం సంధ్యా త్పూర్వ‌ము గాన‌నీయాలండి. సాయంసంధ్యా కాలాన నారాయ‌ణి, హిందోళ‌, సౌరాష్ట్రి, తోడి, రామాళి, వ‌రాళి, వంతు వ‌రాళి, ఉపేని, మాళ‌వి, ల‌లిత రాగ‌ములు శ్రేష్ఠములండి.

ర‌ఘునాథులు ప‌క‌ప‌క న‌వ్వినారు. వాణీ ! నీకు నేను బోధిస్తూ ఉన్నానా, నాకు నువ్వు బోధిస్తూ ఉన్నావా !

ప్ర‌భువులు నన్ను ప‌రీక్షిస్తూ ఉన్నారు.

ర‌ఘు :  గాంధ్వానికి త‌ల్లివంటిది శ్రుతి అయితే తండ్రివంటిది ల‌య‌. ల‌య ప్రాణ‌ము వంటిద‌ని చెప్పిన‌ప్ప‌టికిన్నీ దోష‌ము ఉండ‌దు. హయ‌తి, గోపుచ్ఛ‌య‌తి, పిపీల‌క‌య‌తి, మృదంగ‌య‌తి, విష‌మ‌య‌తి అని ల‌య‌వృత్తిని ఆరు విధాలుగా శాస్త్ర‌జ్ఞులు పేర్కొన్నారు.