అదితాశము ద్వితీయక మంతరక్రీడ
జయమంగళము జంపెలీల
చాచపూటంబు చ్చత్పుటంబును షట్పి
తాపుత్రకంబు విద్యాధరంబు
రతిహంస లీల శ్రీరంగంబు రంగంబు
కంకాళ ఖండకంకాళములును
కోకిల ప్రియము విలోకితంబు కుడుక్క
డెంకి త్రిభంగి మట్టగ విజయము
నంది నందన జయసింహ నందనములు
మొదలుగా గళతాళముల్ మొనసినన్ను
గూడి కవచట్టముగ గొనియాడితేని
బిరుదులిదె ఇత్తును నీకు నేగిరుదటంచు.
సంగీతం కాలస్వరూపం. కాల నియమం లేక సంగీతము లేదు. కాలము, కాళి, పార్వతీ పరమేశ్వరులు.
చిత్తం ప్రభూ ! సంగీతాన సప్తస్వరములు శివశక్తులు. సాహిత్యాన అకారము నుండి క్షకారము వరకు ఉన్న సర్వస్వరవ్యంజన వైఖరులు కూడ శివశక్తులే. సంఖ్యలలో శూన్యస్థానము నుండి నవస్థానము వరకున్నూ వ్యాప్తమైదని శివశక్తి స్వరూపమే. అణువు నుండి బ్రహ్మాండము వరుకున్నూ సర్వాంతర్యామిగా నున్నది కూడ ఆ సర్వవ్యాపులైన శివశక్తులే.
దేవీ ! ఈ విషయాన నేను నీకు శిష్యుడను సుమీ !
ప్రభువులు అతిశయోక్తి అలంకారాన్ని వర్జించామన్నారు ?
అవునవును. బాల్యాన రచించిన పారిజాతాపహరణం లోనూ, గజేంద్ర మోక్షంలోనూ కొలది మాత్రపు అతిశయోక్తులను ప్రయోగించినది సత్యమేగాని, రుక్మిణీ కృష్ణవివాహంలోగాని, జానకీ పరిణయంలేగాని, నలచరిత్రలోగాని మచ్చున కొకటి అయినా చూపించగలవా ?
వాటిని నేను పఠించాను, ప్రభూ ! మీరు శలవిచ్చినది సత్యమే. కాని ప్రభూ ! నాదొక చిన్నమనవి.
ఏమది ?
మీరు చెప్పిన ఈ పరిణయకావ్యాలలో నాకొక స్వల్పమైన లోపము తోచినది. ప్రభువులు క్షమించెదనన్నచో మనవి చేతును.
రఘునాథులు ఉలికిపడినారు. తన రచనలో దోషమెన్నడమా ! గురుదేవులే భళీ యన్న కావ్యాలలో ఈ బాలికకు ఏమి దోషము స్ఫురించినదో ! సంశయమెందుకు ? ఏ దోషమున్నదో చూపరాదా ?
ప్రభువులను మరియొకసారి క్షమాపణ వేడుకొని మనవి చేయుచున్నాను. జానకీ పరిణయంలో గాని, నలచరిత్రలో గాని, రుక్మిణీ కృష్ణ వివాహంలో గాని ప్రభువులు వర్ణించిన శృంగార రసము అత్యంత మనోజ్ఞంగా ఉన్నది. కాని...కాని...
ఊ, సంశయించవద్దు వాణి.
కాని...ఆ శృంగారము ఉత్తమంగానే ఉన్నది. కాని...మహోన్నతమైన దివ్యదేవతాత్వదశకు ఆ శృంగారము చేరుకొనలేకపోయినది. కేవలము మానవుల విరహవేదనలు, చంద్రవసంత మన్మధోపాలంబనలు, అలవాటుగా ప్రబంధాలలో గనవచ్చు అష్టాదశ వర్ణనలుగాక, ఉదాత్తమైన ప్రణయారాధనము. ఈ కావ్యాలలో కనుపించుట లేదు, ప్రభూ !
రఘునాథులు మూడు నిమేషములు నోటమాటరాక, శుకవాణిని చూస్తూ ఉండిపోయిరి. ఈ బాలిక స్వభావమెట్టిది? పాలకులను సైతం విమర్శించగల పరమ స్వాతంత్ర్య బుద్ధియా ? చిన్నవయస్సు అయినందున బాల్య చాపల్యమా ? వైదుష్యమున్నందున అతిశయభావమా ? మరల తానే పరమ విధేయయై, పాదక్రాంతయగునంతటి వినయనిరూపణము చేయునే ? అదేమి ?
శుకవాణీ ! నీవు దోషమని నిరూపించిన విషయాలను, అలంకార శాస్త్ర నికషోవలంతో పరీక్షించినట్లయిన, వాటిని దోషాలుగ నిర్ణయించరాదు. కాని ఎందువలననో నీవు చెప్పినదికూడా అసత్యమని చెప్పడానికి లేదు. ఒక్కమాట, మానవుడు రచించిన కావ్యాలలో ఆ కావ్యకర్తయొక్క అనుభూతిని మించిన రచనను సృష్టించడం శక్తికి మించిన పని. ఆ కావ్యముల రచనాకాలము నాటికి నాకు ఉండవలసిన అనుభవం లేనందున అలా ఉన్నవేమో ! యువప్రభువులు దీర్ఘాలోచనలో అయిదు నిమేషములుండి, తరువాత నిష్క్రమించిరి.
మూడుదినముల పిమ్మట శుకవాణిదేవి గవాక్షము నుండి కనులకు విందులు చేస్తూ ఉన్నపున్నమ చంద్రుని వీక్షిస్తూ వీణెపై పూర్ణ చంద్రిక రాగ ప్రస్తారాన్ని చేస్తూ ఉండగా, రఘునాథనాయకులు సద్దుచేయక ప్రవేశించి, పారి పార్శ్వికలనూ పరిచారికలనూ పంపివేసి, ఆసనంపై ఆశీనులై కనులు మూసికొని, సజీవమూర్తినియై మనోనేత్రానికి దృశ్యమారమై నిలిచిన పూర్ణచంద్రికాదేవి దివ్యరసమాధుర్యాన్ని గ్రోలుతూ ఉండిన వారాయెను. అలా క్షణములు, నిమేషములు, ఘడియలు దాటిపోయినవి. వీణానిక్వాణం ఆగిన మరుక్షణంలో కనులు విప్పి శుకవాణీ దేవిని పరికించినారు. ఆమె కనులలో ఆనందము, ఆశ్చర్యము, తత్తరపాటు కనుగొన్న ప్రభువులు, దేవీ ! ఇదేనా నీవు పలికిన దివ్య ప్రణయభావన ! నీ నేత్రాంచలాలలో జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూన్న ప్రణయదీధితులవంటివి మునుపెన్నడూ అనుభవించి ఎరుగనే ! నీ సమీపార గడచే ప్రతిక్షణమూ ఒక మహదానంద మహా అనుభవంగా పరిణమిస్తూ ఉన్నదే ! నీ చూపులు ఇంతగా బంధిస్తూ ఉన్నవే ! నా హృత్పంజరాన నిన్నెలా పదిలపరచుకోను, దేవీ ! అంటూ తమ మదిలో వితర్కించుకొంటూ ఉన్నారు. |