కతికతినక్షితి పతయః
కింతే రఘునాథనాయకాయంతే
భువి బమనః కిలతరవః
కింతే సంతాన పాదపాయంతే.
మహారాజులవారు ప్రేమైక దృక్కులతో శుకవాణీ దేవిని చూస్తూ ఉండిరి. ఆనాటి విద్వత్సభలో తర్కన్యాయ పూర్వోత్తర మీమాంసాదులపై మున్నెన్నడూ ఎచటనూ కనీవినీ ఎరుగని రీతిలో వాదప్రతివాదములు జరిగినవి. మహారాజులవారి యనుజ్ఞ ప్రకారము శాస్త్రచర్చ అత్యంత సులభరీతిలో తీయని తేట తెలుగులో జరుగుటచేత సామాన్యులకు సహితము విషయము సుగ్రాహ్యమైనది.
అప్పయ్య దీక్షితులవారు అమాత్యుల భవంతిలో విడిదిచేసి యుండిరి. గోవిందమఖుల అప్పయ్య దీక్షితుల వారి మైత్రి ఇంతింతనరానిది. మైత్రి మాత్రమేకాదు, ఒండొరులు హృదయములు విప్పి శాస్త్రమహా విషయములను గూర్చి ప్రసంగించుకొనే సమయాల తాము గాఢంగా నమ్మిన సత్యాలను సైతం మిత్రునిచెంత చిరునవ్వుతో ఓటమిని అంగీకరించేందుకు వెరువరు అప్పయ్య దీక్షితులవారిది క్రమశః జ్ఞానమార్గమైనది. అమాత్యులది కర్మమార్గం. ఇరువురుకు శంకర భగవత్పాదముఖ వినిర్గత వాగమృతధారలే శరణ్యములు.
అమాత్యుల సౌధోపరిని పాలకడలివంటి తెల్లని శయ్యలపై పరుండి వేంకటమఖితో అప్పయ్య దీక్షితులు సంగీతశాస్త్ర చర్చ చేస్తూ ఉండిరి. గోవింద దీక్షితామాత్యులు కూడ వారి ప్రసంగములో తమ అభిరుచులను వ్యక్తపరుస్తూ ఉండిరి. యజ్ఞనారాయణ మాత్రము తండ్రిగారికి పాద సంవాహనము చేస్తూ, ఆనాటి సభలో రత్నభేట శ్రీనివాస దీక్షితులూ అప్పయ్య దీక్షితులూ యజుర్వేదాన్ని గురించి హోరాహోరీగా వాదులాడిన విషయాలను మననం చేసికొంటూ ఉండెను. మామా అల్లుడూ చేసిన ఆ వాదాన్ని ఈ రేయి మిత్రులిరువురు కొనసాగిస్తారని యజ్ఞ నారాయణునకు విధితమే. అనుమానము కలిగినప్పుడు అల్లుడయేది, మామ అయేది, మిత్రడయేది పుత్రుడుయేది ఎవరైనప్పటికిని,తాము భావించినదే సత్యమని వాదించడమేగాని లొంగడమనే సంగతి అప్పయ్య దీక్షితులవారి జాతకానలేదు. తమ వాదనే సరియని నిరూపించు కొనేటందుకు శాస్త్ర మహాసముద్రాన్ని వారు అలవోకగా మధించగలరు. గోవిందా మాత్యులు కూడ అంతటి శాస్త్ర నిష్ణాతులే అయినప్పటికిన్నీ, లౌక్యంతో తమ వాదనే సరియైనదనే భావాన్ని అప్పయ్య దీక్షితులలో కలిగించిన పిదప, తానే ఓటుపడినట్లు ఒప్పుకొనగలిగే హృదయ వైశాల్యముగల ధీశాలి. అదిన్నీగాక అప్పయ్య దీక్షితులు తమకు కొంతకాలము
గురువులుగా నుండిరన్న గౌరవముతో మిన్నకుండుట కూడ పరిపాటియే.
అప్పయ్య దీక్షితులు మౌనము వహించిరి. తదుపరి కొంత వడికి గోవిందామాత్యులు శ్రావ్యగళంతో యజుర్వేద మంత్రమును పఠించిరి.
అగ్ని స్తోమేన బోధయ
సమిధానో అమర్త్యమ్
హవ్యా దేవేషు సోదధత్
అగ్నిమ్ స్తోమేన బోధయ
సమిధాన ఇతి
సమ్ ఇధానః అమర్త్యమ్
హవ్యా దేవేషు సః దధత్
ఈ మంత్రమును విన్న యజ్ఞ నారాయణుని హృదయాన సోమేన సహ సోమేన సహ సోమేన సహ సోమేన సోమేన అని సోమపదం అవృతాలు తిరిగింది. సోమపానమునకు ఎటువంటి నీచమై అర్ధాన్ని చెపుతున్నారీ విప్రులు ! అని వ్యధ చెందినాడు.
అప్పయ్య : అవునయ్యా. గోవిందయ్యా ! ఈ అగ్ని ఉన్నాడు చూచావూ, వాడు కార్యార్ధియై పంపంబడిన చక్కని రాయబారిలాగా వ్యవహరించి సుఖశాంతులను సిద్ధంప చేస్తాడు, సరే ! మంచిమంచి సుగంధ ద్రవ్యాలను, కమ్మని ఆవునేతిని, విలువైన ముత్యాలు పగడాలు బంగారం మొదలైన ద్రవ్యాలను అగ్నికి ఆహుతి చేయడంలో అంత ఉత్సాహం చూపిస్తారెంకుదయ్యా ! జ్ఞానం ప్రధానంకాని కర్మలవల్ల మోక్షం రాదయ్యా. ఇరువురు దీక్షితులున్నూ జ్ఞాన కర్మల మీద వాదన ప్రారంభించారంటే, వేగుచుక్క పొడిచేవరకు విరమించరు.అలసటవచ్చినిద్రకూరకువస్తేనేగనిమౌనంవహించరు. |