44
 

న‌గ‌రాజ‌కుమారి, చిన్నాయ‌నగారూ ! ల‌క్ష్మి యువ‌రాజులుంగారిని నిలువుదోపిడీ చేస్తుందీ దినాన‌, అని సంతోషంతో వెలిగిపోయే మోముతో ప‌లికింది. మూర్తెప్ప న‌గ‌రాజ కుమారిని దగ్గ‌ర‌కు తీసుకొని, తల్లీ ! నీ జాత‌కం క‌డు విచిత్రం కాబోవుతున్న‌ద‌ని నా హృద‌యంలో ఏదో చెప్పుతున్న‌ది, అని చిరున‌వ్వు న‌వ్వినారు.
ప్ర‌భూ ! మా న‌గ‌ము జాత‌కం మా అక్క అనేకులు మ‌హాపండితుల‌కు చూసిస్తూనే ఉంటుంది. ఎవ‌రు చెప్పినా, ఈ బాలిక‌కు కోరిన భ‌ర్త ల‌భిస్తాడ‌నీ, త‌న భ‌ర్త‌తో మా న‌గ‌రాజు దివ్య‌య‌శ‌ము సంపాదిస్తుంద‌నీ వ‌ర్ణించారు, అని అన్న‌ది.

దానికేమీ సందేహ‌ము లేదు దేవీ, ! అని మూర్తెప్ప నాయ‌నింవారు న‌గ‌రాజును ద‌గ్గ‌ర‌కు తీసుకొని, నువ్వు విద్య‌ల‌న్నీ బాగా నేర్చుకుంటున్నావా, అమ్మ‌డూ అని పృచ్ఛించినాడు. న‌గ‌రాజు చిరున‌వ్వుతో అలా త‌ల‌వంచుకొనే ఉన్న‌ది.

ఆ వెన‌క ఆ బాలిక పిన‌త‌ల్లీ, ఆమె భ‌ర్తా న‌గ‌రాజ కుమారిని శిబిక‌పై నెక్కించి ఆమెను పంపి తాము లోనికి వెళ్ళినారు.

9

మ‌హామంత్రి గోవింద దీక్షితుల‌వారి సంగీత‌రంగ మంట‌పంలో య‌ధోచితాస‌నాల గోవింద దీక్షితుల వారూ, వారి కొమ‌రులు య‌జ్ఞ‌నారాయ‌ణ దీక్షితులూ వేంక‌ట‌మ‌ఖీ, అనేకులు పండితులూ కూర్చండి యుండిరి. మ‌హామంత్రి ఆస‌నాన‌కు కుడివేపున ర‌ఘునాధ నాయ‌కుల‌వారి ఆస‌న‌మున్న‌ది. యువ‌రాజు ఇంకా రాలేదు.

ఆ స‌భ‌లో గాన నాట్య ప్ర‌ద‌ర్శ‌నాదులు జ‌రుగుట‌కు కావ‌ల‌సిన సౌక‌ర్యాల‌న్నీ ఏర్పాటు చేసినారు. ఆ స‌భామందిరం నిర్మించిన వాస్తు శాస్త్ర‌జ్ఞుడు నాట్యం చేసేందుకు విశాల‌రంగ‌స్త‌ల‌మును నిర్మించాడు. ఆ స‌భామందిరం అంతా దూదివ‌త్తి దీపాల‌తో చిత్ర చిత్రాలంకారాల‌తో విక‌సించి ఉన్న‌ది. అగ‌రు ధూపాలు క‌రండాలు సుర‌భిళ‌పు పొగ‌ల‌ను ఆ మందిరం అంతా వెద‌జ‌ల్లుతున్న‌ది.

చెంచుల‌క్ష్మి బాల‌స‌ఖీజ‌న ప‌రివృత‌యై, లోనికి వ‌చ్చి గురువుల ఎదుట సాగిల‌ప‌డివ న‌మ‌స్క‌రించి లేచి, గురుకుమారుల‌కు పండితుల‌కు న‌మ‌స్క‌రించి వెళ్ళి త‌న వీణియ‌పెట్టి ఉంచిన రంగ‌స్థ‌లం ఎక్కి, వీణియ‌ముందు నిల్చుండి, అక్క‌డ ఉన్న మృదంగానికీ, వీణెల‌కూ, వేణువున‌కూ, శృతి తాంబూరాకూ న‌మ‌స్క‌రించి, ఆయా వాద్య‌కుల‌కు న‌మ‌స్క‌రించి ఆస‌న‌మ‌లంక‌రించిన‌ది. చెంచుల‌క్ష్మి శృతి అంద‌ర‌కు తెలుసును. అయినా ఒక్క‌సారి ఆమె కంఠానికి అన్నీ స‌రిగా ఉన్న‌వో లేవో్ స‌రిచూచుకొన్నారు.

ఇంతో ర‌ఘునాథ నాయ‌కులు మెల్ల‌గా త‌మ ఆస‌నం క‌డ‌కు వ‌చ్చినారు. మొద‌ట ఎవ్వ‌రూ గ‌మ‌నించ‌లేదు. ప్ర‌భువు రావ‌డం గ‌మ‌నించి అంద‌రు ఒక్క‌సారిగా లేచినారు. ర‌ఘునాథ నాయ‌కులు త‌మ గురువు గోవింద దీక్షితుల‌కు న‌మ‌స్క‌రించి, త‌మ ఆస‌నం అధివ‌సించి నారు. చెంచుల‌క్ష్మి ర‌ఘునాథునికి న‌మ‌స్క‌రింప‌, వారు ఆశీర్వ‌దించి అనుమ‌తిగా త‌న ఊప‌, త‌న ఆస‌నం అధిప‌సించింది.

వెంట‌నే వీణ ఎదుట‌గా ఉంచుకొని, మ‌న‌సులో దేవ‌త‌ల‌కు మ్రొక్కుకొని, గురువు గోవింద దీక్షితుల‌ను త‌ల‌చుకొని ఆ బాలిక మాయామాళ‌వ గౌళ‌రాగ మాలాప‌న ప్రారంభించిన‌ది. స‌రిగ‌మ ప‌ద‌నిస ఆరోహ‌ణ‌ము, సనిద‌ప మ‌గ‌రిస ఆవ‌రోహ‌ర‌ణ‌మైన‌ది. ఇందు శుద్ధ రిష‌భ‌ము, అంత‌ర‌గాంధార‌ము, శుద్ధ మ‌ధ్య‌మ‌ము, శుద్ధ దైవ‌త‌ము, నిషాద‌ము కాక‌లి.

ర‌ఘునాథ యువ‌రాజు అశ్చ‌ర్యం పొందినాడు. ర‌త్నాక‌ర‌మైన ఔత్త‌రాహంలో కాని, రామ‌యామాత్య‌మైన క‌ర్ణాట బాణిలోగాని మాయ‌మాళ‌వ‌గౌళం ఈ విధంగా ఉండ‌లేదు. ఈ బాలిక సంపూర్ణ రాగం ఆల‌పించింది. అన్నీ శుద్ధ స్వ‌రాలు గ‌ల మేళ‌ము. ఈ శుద్ధ‌రాగ‌ము చాలా మ‌నోహ‌రంగా ఉంది అనుకున్నారు.

య‌జ్ఞ‌నారాయ‌ణుడు మ‌హాక‌వి, అలంకార‌శాస్త్ర స‌ముద్రుడు, సంగీత శాస్త్ర‌జ్ఞానం క‌ల‌వాడు, విమ‌ల గాంధ‌ర్వ ప్ర‌జ్ఞ‌. అంతేకాబ‌ట్టి ఏమీ ఆలోచ‌న లేక ఏదో సంప్ర‌దాయ విరుద్ధ‌ము క‌లిగినా సంప్ర‌దాయ భంగ‌ము కాక మ‌నోహ‌ర‌త్వ‌మీ బాల క‌లియంపి వెద‌జ‌ల్లుతున్న‌ద‌ని ఆనంద‌మందినాడు.

చెంచుల‌క్ష్మి రాగం ప్రారంభించ‌గానే వెంక‌ట‌ముఖి ఉలిక్కిప‌డినాడు. అత‌నిలో ఏదో దివ్య‌మైన స్పంద‌న క‌లిగింది. ఏదో పెద్ద అనుమానం త‌న హృద‌యం నుండి కరిగిపోయిన‌ట్ల‌యిన‌ది. ఏదో ఒక ప‌ర‌మ ప‌విత్ర ద‌ర్శ‌న‌ము అస్ప‌ష్ట‌మై ఆ బాలునికి గోచ‌రించిన‌ది.