రఘునాధ ప్రభువు ఆ బాలిక ఆరోహణావరోహణ గమకాదులు, కల్పన నాగస్వర రాగంతో లయమయ్యే ఫణీంద్రునిలా, కన్నులరమూతలుగా వింటున్నారు.
కాలం మహావేగంగా పరుగెత్తుతున్నది. నూతన మార్గాలు అన్వేషిస్తున్నారు. గ్రామము మూర్ఛనలుపోయి రాగములు రాగిణులు రాగపుత్రుల భావం పోతున్నవి. ఈ బాలిక హృదయంలో ఈలాంటి ఆవేదన ఏదో లేకపోతే రాత్రి ప్రధమ యమౌచిత్య రాగముతో ప్రారంభించడం మానివేసి, రాత్రి ప్రధమ యామకాల హృదయ రంజకమైన మాయా మాళవగౌళతో తన సభను ప్రారంభించిందని అనుకున్నాడు, యువరాజు.
మాయా మాళవగౌళ రాగాలాపన పూర్తి అయినది. వెంటనే ఆ బాలిక భైరవిలో తానవర్ణం ప్రారంభించింది.
శుభకర శ్రీ విఘ్నరాజ నన్నేలుకోర
నా స్వామి భైరవేశ్వరుడె లేర
ఈ తనానికి అధి దైవము
గానామృత మాతని
డమరుక జనితము కాదుర అని పాడింది. ఆదితాళం, చతురశ్ర రిషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, శుద్ధదైవతము కైశికిషాదము. సరిమగపదనిస ఆరోహణమై, సనిదప మగరిస అవరోహణమై రీమాగరిగగరీ = ససరిరి = గగ, రిస = నిద = గరిని, సరి సమమ గరిస, అని తాన ప్రస్తారము గావించినది.
ఆమె కంఠము దివ్య మధురతా పధ ప్రధమలోక సంచరితమై పరమ మనోహర సంపూర్ణము.
పాట సాగినకొలదీ ఆ కంఠములో పూర్ణత ఎక్కువైనది. విరియబోవు పారిభద్ర పుప్పమది. శ్రుతి, లయ, తాళాదులు ఈ బాలికకు బానిసీలు అనుకున్నాడా యువరాజు.
ఇది అదను కాదని ఎదుటకు రావో
మదన జనక మదిని దయలేదుర
పధములు తిరిగి తిరిగి
పదములు అరిగి అరిగి
బదరిలోనో మధురలోనో
పడమట ద్వారకలోనో
దొరికెదవని పోయితి
బరువయ్యె బ్రతుకంత
ఇది అదను కాదని
ఈ గీతమును తానవర్ణమైన వెనుక చెంచులక్ష్మి ఎత్తుకొన్నది.
నీలాచలమున వెదికి
నేలనేలలు గడిచి
చేరితిమన్నారు
క్షేత్రము స్వామీ !
పరమపురుషుడవో ఘనచోరుడవో తెలియక
చెదరిన మనసున నిలచితి
ఇది అదనుకాదని -
దేశాక్షిరాగిణిలో ఈ పాట సర్వ పరీమళ కదంబము సభ్యులపై కలయంపి చల్లినదా బాలిక.
గోవిందమఖి, ఇకచాలు అని తల ఊపినారు. సంగీతసభ అయినది. సభ అంతకూ నమస్కరించి, ఆ బాలిక రంగస్థలంలో నేపధ్యానికి వెడలిపోయినది.
వేంకటమఖి లేచి యువరాజులవారికీ పండితులకూ తాంబూలాలు అర్పించినారు. చెంచులక్ష్మి చెలికత్తెయలలో నొకరిత వచ్చి ప్రభువులకు ముత్యపుచిప్పల సున్నంతో ఆకులురాసి తాంబూలమర్పించినది. రఘునాథుడు గురువును చూచి, గురుదేవా ! ఇంతటి శిష్యురాలు తమకెక్కడదొరికినది ? అని హృదయ పరితృప్త మహదానందార్ద్రిత హాసాంచలములైన చూపులు పరిచినాడు.
ప్రభూ ! ఈమెను తమకు శిష్యనుగా చేయసంకల్పించినాను.
నాకా !
అవును, ప్రభూ ! తమ మేనమామ కొమరిత తమకడ విద్య పూర్తి చేయవలెనను కదా !
దేశికుల మాటలు అర్ధంకావటంలేదు. |