దండుబాటలో బళ్ళు నెమ్మదిగా సాగిపోతున్నవి. గుఱ్ఱాలు పరుగెత్తాలి గాని ఎద్దులతో కలిసి ఎక్కడ నడవగలవు ? గేదెలు, ఆవులు హంబా అనీ, అరస్తూ నడుస్తున్నవి. ఏనుగులు ఎంత నెమ్మదిగా నడచినా అతి వేగమే. ప్రయాణంలో ఏనుగులు ముందుకుసాగి, జాము ప్రొద్దెక్కే వరకు నడిచి అక్కడ బావిగాని, సంత్రంగాని, పల్లెగాని, ఏరుగాని దొరికితే ఆగిపోతాయి. మావటీళ్ళు ఇంటరొట్ట, ధాన్యము, కొబ్బరి , కురిడీలు, నేయి అరటి కాయలు పెడతారు.
సేవకులు ఏనుగులు మీదనుండి డేరాలు దింపి, ఆ చెట్ల క్రింద పాతుతారు. కొంతసేపటికి అంతకుముందే బయలుదేరిన ఎద్దులబళ్ళు వస్తాయి. ఇంతలో గుఱ్ఱాలు పూన్చిన పెట్టెబళ్ళమీద వేంకటపతీ మిగిలినవారూ వస్తారు. ఎద్దుల బళ్ళూ, గేదెలు, ఆవులూ రాత్రే బయలుదేరి నెమ్మదిగా కునికిపాట్లు పడుతూ, ఉంటే ఏనుగులు కలుసుకొని ముందుకు పోయి, శిబిరము ఏర్పాటు చేస్తే గేదెలు, ఆవులు అక్కడ ఆగుతాయి. ఆ పశువులతో పశువుల మేతమోసే రెండు ఎడ్ల బళ్ళూ వెడతాయి. ఇదీ వేంకటపతి యేర్పాటు చేసిన ప్రయాణ విధానం.
వేంగీపురం నుండి బయలుదేరిన రెండు జాములకు శోభనాచలం పొవుదారిలో ఒక చిన్న సత్రం దగ్గిర ఆగినారు. ఆ ప్రక్కనే చిన్న గుట్ట. కొంత ఎత్తు రాళ్ళో నుండి ప్రవహించి వచ్చే ప్రస్రవణమూ ఉన్నాయి. నీరు చాలా నిర్మలంగా ఉంది. చుట్టూ రావిచెట్లు, మఱ్ఱిచెట్లు కాలిబాట ప్రక్కనే ఉన్నాయి. ఆ మహారాజు పధము యుగయుగాల నుంచీ ఉన్నదనీ, అది దేవతలే నిర్మించారనీ. కాశీ రామేశ్వరాది యాత్రలు చేసేవారు చెప్పుకుంటారు.
ఆంధ్రదేశంలో సాధారణంగా బందిపోటు దొంగల భయంలేదు. సమస్తమైన పంటలూ పండే భూములు సమప్రదేశాలు కావడంవల్ల క్రోశము రెండు క్రోశాల దూరాన గ్రామాలున్నాయి. అన్ని గ్రామాలలో ప్రజలకూ తిండీ గుడ్డా పుష్కలంగా ఉన్నాయి. ఆ దేశంలో కరువులేలవు. చిన్నచిన్న సామంతరాజ్యాలు అనేకం ఆంధ్ర చక్రవర్తుల పరిపాలనలో ఎప్పుడూ ఉండేవి. ఆంధ్రసామంతులు ఉత్తమ బ్రాహ్మణత్వం కోల్పోయిన క్షత్రియ సచ్ఛూద్ర జాతులైన రాజులు, రెడ్లు వెలదులున్నూ, కమ్మనాటి, వెలనాటి, పాకనాటి, భూమంచి, కూతాడ, పంట, తెలుగునాటి రెడ్లు, పద్మనాయక, వెలమ, మహావెలమ మొదలైనవారు మున్నూరు, ముదిరాజు, పెరికనాటి రెడ్లు, బలిజ రెడ్లు, వీరందరూ ఉత్తమ సంప్రదాయానికి చెందినవారు, సంస్కారులు.
రాజకీయాలను బట్టి సామంతతనం వదల్చుకోవడమో లేక ఇంకొకరకి సామంతులు కావడమో, తమపై రాజాధిరాజులకు సహాయానికి యుద్ధానికి వెళ్ళడమో అంతే వీరు చేసేది. బ్రాహ్మణుల అగ్రహారాలు మానరు. దేవాలయాలు క్రమంగా జరిగేటట్టు చూసారు. రాచబాటలు సరిగా ఉండేటట్లు చూస్తారు. రాజపధాల వెంట ప్రయాణం చేసే ప్రయాణీకులకు ఏ ఇబ్బందీ ఉండకుండునట్లు అన్నీ ఏర్పాట్లు చేస్తారు. వైద్యశాలలు, పశువైద్యశాలలు, సత్రములు అన్నీ సవ్యంగా జరిగేటట్లు అప్రమత్తులై ఉంటారు.
కాబట్టి వెంకటపతి ప్రయాణము సౌఖ్యముగా సాగిపోతున్నది. శోభనాచలము, కనకదుర్గ క్షేత్రము వచ్చారు. శీతాకలమవడంచేత కృష్ణానది ఇసుకమధ్య చిన్న పాయలుగా ప్రవహిస్తున్నది. నదికి ఈవల నుండి ఆవలకు రావాలంటే ఇసుక తిప్పలలో ఏర్పడిన బండిదారిని రేవులకు పోతే అక్కడ దాటువేసే తెప్పలమీదకు బండ్లు తోలుతారు. ఎడ్లు, ఏనుగులు, గేదెలు ఈదుకుపోతాయి. నావలలో మనుష్యులు దాటుతారు. గుర్రపుబళ్ళు, ఎద్దుబళ్ళు తెప్పలమీద దాటుతాయి. ఇసుకలో గుర్రపు బళ్ళను మనుష్యులు లాగుతారు.
వేంకటపతి కుటుంబమంతా మల్లేశ్వరస్వామిని కనకదుర్గను పూజించుకొన్నారు. ఇంద్రకీలాద్రి పర్వతము అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం చూచి ఆనందించినారు. కృష్ణవేణిదేవిలో మూడు రోజులు కృతావగాహులై మునిగి ఆ వెనక బయలుదేరినారు.
వేంకటపతి ఎవరో స్వామి సముద్దారుడనుకొన్నారు. అందుకనే వేశ్యాకుల సంజాతుడని తెలుసుకున్నా బ్రాహ్మణులు పనిచేసేవారు. వడికల వాండ్లు వేంకటపతికి రాజమర్యాదలు జరిపినారు. గుళ్ళోనూ రాజమర్యాదలు జరిగినవి.
కృష్ణ దాటి మంగళగిరి క్షేత్రంచేరి, ఆ పానకాలరాయని దర్శించినారు. వేంకటపతికి ఆంధ్రదేశంలోని నరసింహ క్షేత్రాలన్నీ జ్ఞప్తికి వచ్చినవి. తాను కోరుకొండ నరసింహదేవరను సందర్శించినాడు. సింహాద్రి నరసింహుని గూర్చి విన్నాడు. అంతర్వేది ఉప్పు నరసింహక్షేత్రాన్ని దర్శించినాడు. శోభనాచల నరసింహుని దారిలో దర్శించినారు. |