57
 

కృష్ణాతీరాన విజ‌య‌వాడ‌కు ఎగువ‌ను వేద‌గిరి న‌ర‌సింహ క్షేత్రాన్ని గూర్చి విన్నాడు. అహోబిల‌ము, క‌దిరి, బేట్రాయి, పెంచెల‌, పంపాక్షేత్రాల న‌ర‌సింహుని గూర్చిన క్షేత్ర‌మాహాత్యాల‌న్నీ ఆ బాల‌క‌వి శిరోభూష‌ణుడు చ‌దువు కొన్నాడు.

న‌ర‌సింహ‌దేవ‌ర ఆంధ్రుల‌దైవము. ఆంధ్రులు సింహ ప‌రాక్ర‌ములు. ఎటు వ‌చ్చినా అతివ్య‌క్తిత్వ‌ము ఆ కార‌ణంచేత ఐక‌మ‌త్య‌త‌లేదు. ప‌రాక్ర‌మ‌శీలురైన చ‌క్ర‌వ‌ర్తులు పాల‌న చేయ‌ద‌గిన దేశం. నీర‌సించిన చ‌క్ర‌వ‌ర్తికి నిలువ‌డానికి నీడ‌రొర‌క‌నీయ‌వు, త‌క్కిన సింహాలు.

ఎన్ని మ‌హావంశాలు పోలేదు ? విజ‌మ‌న‌గ‌రంలో ఒరిగిపోయిన ప్ర‌తాపం మ‌ళ్ళీ దేశానికి దొర‌క‌దు. మొన్న‌నే గోల‌కొండ‌వారూ, బీజ‌పురం వారూ ఎత్తివ‌స్తే చ‌క్ర‌వ‌ర్తి వేంక‌ట‌ప‌తి రాయ‌లంవారు తంజావూరి ప్ర‌భువును స‌హాయ‌ము కోరినార‌ట‌. చ‌క్ర‌వ‌ర్తుల‌కు సామంతుల్ని స‌హాయం కోర‌వ‌ల‌సిన దుర్గ‌తి ప‌ట్టుకొంది. శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ సార్వ‌భౌముడు సామంతుల‌కు ఆజ్ఞ‌లిచ్చేవారు. ఆజ్ఞ ప‌రిపాలించ‌ని నాగ‌మ‌నీని విష‌య‌ము ఏమ‌యింది ? చివ‌ర‌కు తండ్రిని బందీ చేయ‌డానికి కుమారుడైన విశ్వ‌నాధ నాయ‌కుడే వెళ్ళినాడు.

ఆ విశ్వ‌నాధుని వంశంవారే ఇప్పుడు తిర‌గ‌బ‌డుతూ ఉండ‌ట‌మూ, చ‌క్ర‌వ‌ర్తి వారిని ఓడిస్తూ ఉండ‌ట‌మూ జరుగుతున్న‌ద‌ని వేంక‌ట‌ప‌తి ఊహించుకొన్నాడు.
మంగ‌ళ‌గిరి పాన‌కాల‌రాయుడు ఎన్ని ఊహ‌లు క‌లిగించినాడు ! ఈ ప్ర‌భువు స‌రిగ్గా స‌గం పాన‌కం తాగుతాడు. ఎన్ని యుగాల నుంచీ తాగుతున్నాడో ! ఆ దేవుని మ‌హాశ‌క్తి ఈ కొండ‌ను ఆవ‌హించి ఉన్న‌ది కాబోలు !

శివుడు పోరాడి నాశ‌నంచేసిన అసురులు ఆర్యావ‌ర్త భూముల‌లోనూ, విష్ణువు పోరాడిన అసురులు దండ‌కార‌ణ్య భూప‌ముల‌లోనూ నివ‌సించేవారు కాబోలు ! ఉత్త‌రాదిని న‌ర‌సింహ‌దేవుని గుడులేలేవు. ఎంత‌వ‌ర‌కూ శ్రీ కృష్ణ‌ప్ర‌భుని దేవాల‌యాలే.

అందుక‌నే దాక్షిణాత్యులైన ఆదిశంక‌రులు, ల‌క్ష్మీనృసింహ మ‌మ‌దేహి క‌రావ‌లంబం అని ప్రార్ధించినారు. ఎర్రాప్ర‌గ‌డ నృసింహ‌పురాణం తెలుగు చేసినాడు.

మంగ‌ళ‌గిరి నుండి వారం దినాల‌కు పాక‌నాడు విక్ర‌మ‌సింహ‌పురిని చేరుకున్నారు.అచ్చ‌ట పెర‌మాళ్ళుని సేవించి, హ‌రిహ‌ర‌నాధుని కొలిచి కాళ‌హ‌స్తి మూడు దినాల‌కు చేరినాడు. కాళ‌హ‌స్తీశ్వ‌రుని ఆరుదినాలు సేవించినారు. వారు సువ‌ర్ణ‌ముఖిలో స్నానంచేస్తూ, ఆ వాయులింగేశ్వరుని కొలుస్తూ ఉన్నారు. ద‌క్షిణ భార‌తంలో పంచ‌భూత లింగాలు ఉన్నాయి. కాళ‌హ‌స్తీశ్వ‌రుడు వాయులింగుమ‌, కంచిలో భూలింగేశ్వ‌రుడు, తిరువ‌ణ్నామ‌లైలో అగ్ని లింగేశ్వ‌రుడు, చిదంబ‌రంలో ఆకాశ లింగేశ్వ‌రుడు, జంబుకేశ్వ‌రంలో జ‌ల‌లింగేశ్వ‌రుడు వేంచేసి ఉన్నారు.

ఏకేశ్వ‌రేశ్వ‌ర‌మైన బ్ర‌హ్మ‌భావంలో నుంచి ఆర్య సంప్ర‌దాయ మ‌హాన‌దిలో ఎన్నో శాఖోప‌శాఖ‌లు అనంత‌మై ఉధ్బ‌వించాయి.

ఇక్క‌డ కాళ‌మూ హ‌స్తీకొల‌వ‌డంవ‌ల్ల ఈ ప‌ర‌మేశ్వ‌రుడు కాళ‌హ‌స్తీశ్వ‌రుడైనాడ‌ట‌. ఈ క్షేత్ర‌మహాత్యాన్ని ఎంత తీయ‌ని ఆంధ్ర‌భాష‌లో ర‌చించాడు, ధూర్జ‌టి, ఆ గ్రంధంక‌న్న ఆ మ‌హాక‌వి ర‌చించిన నృసింహ శ‌త‌క‌ము అన‌న్య‌మైన‌ది.

నువ్వు మృత్యుంజ‌యుడ‌వు, గ‌ర‌ళ కంఠుడువు, నువ్వు దివ్య వ‌టుడ‌వు, ప్రభూ ! నీకు నా స‌ర్వ‌స్వ‌ము నివేదించుకుంటున్నాను అని వేంక‌ట‌ప‌తి ప్రార్ధించినాడు. కాళ‌హ‌స్తి నుండి తిరుప‌తి వెళ్ళినారు.

ఓం న‌మో వేంక‌టేశాయ‌
పురుషాయ మ‌హాత్మ‌నే
ప్ర‌ణ‌త‌క్లేశ నాశాయ‌

గోవిందాయ‌న‌మో న‌మః అని ప్రార్ధించుకుంటూ కొండ ఎక్కినారు. వేంక‌ట‌ప‌తీ, అత‌ని త‌మ్ములూ, ఆడ‌వారిరువువూ డోలీల‌లో ఉండి ఎక్కుతున్నారు.

వేంక‌టేశా ! శేషాచ‌ల‌ప‌తీ ! శ్రీనివాసా ! పాహిమాం ! పాహిమాం ! మ‌మ్ము తోడుకో స్వామీ.

నీదు మంద‌రోజ్వ‌ల మూర్తి నీల‌కాంతి
నీదు విక‌సితాన‌న‌ము వెన్నెల‌ల వెలుగు
నీదు రెండు లోచ‌న‌ల‌ములు నెల‌యు, పొద్దు,
నీదు పాదద్వ‌య‌ము, మాకు నెఱవు, నెల‌వు.

శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వ‌ర‌ప్ర‌సాద సంభ‌వుడు వేంక‌ట‌ప‌తి. అశేషాచ‌ల స‌ప్త‌శిర‌స్స్వ రూప మ‌హాన‌గాంచిత దివ్య‌సోపాన పంక్తీ ప్ర‌స్థాన ప్రాప్త‌చ‌ర‌ణ సుంద‌ర‌మూర్తి, ఆంధ్రుల‌కు కుల‌దైవ‌ము మంగ‌ళ విగ్ర‌హ‌మూర్తియై ద‌ర్శ‌న‌మిచ్చాడు. స‌హ‌స్ర‌నామాది స‌ర్వార్చ‌న‌లు స్వామికి అర్పించి నారు వారంతా.