68
 

సైనికుడు వ‌చ్చి, త‌న గుఱ్ఱ‌ముతో, రామ‌చంద్రా నువ్వు ఇక్క‌డే ఉండు. త్వ‌ర‌లో వెళ్ళిపోదాము అని చెప్పి సోద‌రుల చెంత‌కు వ‌చ్చినాడు.

వెంక‌ట‌ప‌తి : సైనికా, నీ అశ్వ‌మున‌కు మాన‌వ‌భాషేనా లేక రాజ‌కీయ‌ములు కూడా నేర్పినావా ?

సైనికుడు న‌వ్వినాడు. మిత్ర‌మా, నా అశ్వ‌మున‌కు హృద‌య‌భాష నేర్పాను. అది నా హృద‌యాన్నెరిగి ప్ర‌వ‌ర్తిస్తుంది.

ఓహొ ! న‌కులుడ‌వు కాబోలు !

ఇంకా న‌య‌ము న కులుడ‌వు అన‌లేదు !

న‌క‌లుడంటే కులంలేనివాడ‌నా ? అన్న‌మ‌రాజు అడిగినాడు.

మిత్ర‌మా, ఏది నీ గ్రంధ‌ము ? కొన్ని మ‌చ్చుతున‌క‌లు రుచి చూప‌రాదా ? ఈ దిన‌ము నేను ఎక్కువ‌కాల‌ము ఉండుట‌కు లేదు.

అన్న‌మ‌రాజు : అన్న‌య్యా, ఇంత‌కుముందు నేను చెప్పిన‌మాట ఇత‌నికి చెప్ప‌వా ?

సైనికుడు : రాజూ ! నాతో చెప్పుట‌కు భ‌యంమెందుకు ? మ‌ధ్య‌న మీ అన్న సార‌ద్య‌ము కావ‌లెనా ?

వెంక‌ట‌ప‌తి : సైనికా ! నా త‌మ్మున‌కు సైన్య‌మున చేరి యుద్ధ‌ముల‌లో పాల్గొన‌వ‌లెన‌ని ఉన్న‌ద‌ట ! కాని అత‌డు బ్రాహ్మ‌ణుడు. క్షాత్ర ధ‌ర్మ‌మున అత‌డు రాణించ‌లేదు. రాఱించ‌లేడు.

సైనికుడు : వ‌య‌స్యా, నిన్ను నేను నాలుగు దినాల నుండి చూచుచున్నాను. ఒకసారి నీవు ప‌ర‌మ ప్రామిణికుని వ‌లె మాటాడుదువు. వేరొక సారి పసిబిడ్డ‌వ‌లె అమాయ‌క‌ముగ అర్థ‌ములేని మాట‌లాడుదువు. ప‌రశురాముడు ఎన్నిమార్లు క్ష‌త్రియుల‌ను నిర్మూలించినాడు ? అత‌నిదే కుల‌ము ? అత‌డిది ఏ ఆయుధ‌ము ? పోనీ అది పురాణం అనుకొంద‌ము. రాజ్య‌ములేలిన వారిలో బ్రాహ్మ‌ణులెంద‌రో నీకు తెలుసును ! మ‌రి నీ తమ్ముని నేడెల వెనుతీతువు ?

అన్న‌మ‌రాజు : నాకు మీ స‌హాయ‌ము కావ‌లెను. ప్ర‌భువు వారితో చెప్పి నా కోరిక తీర్చ‌వ‌లెను.

సైనికుడు మంద‌హాస‌ముతో అన్న‌మ‌రాజు వీపు త‌ట్టినాడు. అ త‌ట్టుట‌లోనే అత‌ని కోరిక తీరునన్న అభ‌య‌మున్న‌ది. రాజూ, మీ అన్న కోరికేమిటి ? ప‌్ర‌భువుత‌లో చెప్పి త‌న‌ను ఏ కొలువులో ప్ర‌వేశ‌పెట్ట‌వ‌లెనో చెప్ప‌నా, లేక నన్ను మించిన ఆప్తులెవ‌రైన సాయ‌ము చేయుట‌కు క‌ల‌దా -

వేంక‌ట‌ప‌తి : నాకీ ప్ర‌దేశ‌ములు కొత్త. ఇచ్చ‌ట మూడు ఆస్థాన‌ములున్న‌వ‌నీ మూడింటిలోనూ క‌వుల కాద‌ర‌ణ క‌ల‌ద‌నీ మా గోదావ‌రీ తీర‌మున గొప్ప‌గ చెప్పుకొంటాము. ఆ మూటిలో నాకేది శ్రేష్ఠ‌మో, నేనెచ‌ట నిలువ‌గ‌ల‌నాడ‌నో నిర్ణ‌యించు కొన‌లేక నెమ్మ‌దిగ ప్ర‌యాణ‌ము చేయుచున్నాను. అంధ‌కార‌ములో వెలుగు దివ్వెవ‌లె నీవు నాకు ఆ సూర్య‌నారాయ‌ణ ప్ర‌సాద‌ముగ క‌నుపించినావు.

సైనికుడు : అయిన‌చో మ‌రీ మంచిది. మ‌న ఇరువురి దైవ‌మూ ఒక్క‌డే. ఆదిత్య హృద‌య‌ము ప‌ఠించ‌నిదే నాకు దిన‌చర్య మొద‌లుకాదు.

వేంక‌ట‌ప‌తి : నాకు ఇదంత‌యూ శుభ‌ముగా తోచుచున్న‌ది. నేను జింజికోట‌ను దాటి వ‌చ్చాను. అయిన‌ప్ప‌టికిని నీవు పొమ్మంటే మ‌ర‌ల వెనుక‌కు తిరిగి జింజిలో ప్ర‌వేసిస్తాను. లేదా, మ‌ధుర పోవ‌లెన‌న్న ఇంకెంత దూర‌ము పోవ‌లెను ? తంజ ప‌ట్ట‌ణానికి ఎంత దూర‌ము ?

సైనికుడు : జింజికి పోదువో గంజికి పోదువో నాకు తెలియ‌దు, మ‌ధుర‌కూ మాకూ ష‌ష్టాష్ట‌క‌ములు, ఇక నాదేశ‌మును గురించి నేను చెప్పుకోను. మ‌రి సెల‌వు. సైనికుడు లేచి నిల‌బ‌డినాడు.

వేంక‌ట‌ప‌తి : సైనికా, తొంద‌ర‌ప‌డ‌కు. నామాట పూర్తిగ విన్పించుకోక‌నే లేచిపోదువేమి ? ఇదేమి మిత్ర‌త్వ‌మ‌య్యా ! జింజిమీద మ‌ధుర మీద నాకంత మోజులేదు. కాని స‌ప్త‌గిరుల‌పై వేంచేసిన శ్రీ‌నివాస‌మూర్తి నాకు ర‌ఘునాథ‌మూర్తివె కోదండ ధ‌నుర్ధారియై దృశ్య‌మాన‌మైనాడు. దాని య‌ర్ధ‌మేమ‌ని యోచించుకొన‌గా ర‌ఘునాధుని యొద్ద‌కు పొమ్మ‌ని శ్రీ‌నివాసుడు న‌న్నాజ్ఞాపించెనా అన్న త‌ల‌పు క‌ల్గిన‌ది. మ‌ర‌ల‌నొక భ‌య‌ము. ఆ ప్ర‌భువు స్వ‌య‌ముగా క‌వియ‌ట‌. ఒక్క‌రాత్రిలో పార‌జాతాప‌ర‌హ‌ర‌ణ కావ్యాన్ని ఆశువుగా చెప్పేస‌రికి వ్రాయ‌స్త‌గాండ్రు వ్రాయలేక ఉక్కిరిబిక్కిరై గుడ్లు మిట‌క‌రించినార‌ట !

అన్న‌మ‌రాజు : అంతేకాదు, తండ్రిగారైన అచ్యుత‌నాయ‌నింవారు ర‌ఘునాధుల‌కు క‌న‌కాభిషేక‌ము కూడా చేసినార‌ట క‌దా !

సైనికుడు : అవును, అదంతా య‌దార్ధ‌మే. అయితే దానికీ నీ సంశ‌యానికీ సంబంధ‌మేమిటి ?

వేంక‌ట‌ప‌తి : సంబంధ‌ము కాదు. అంతటి దొడ్డ‌క‌వి క‌నుల‌కు నేను క‌న్పిస్తానా ? క‌వియైన‌ వానికి మ‌రియొక‌రి క‌వ‌న‌ము న‌చ్చ‌దంటారు. మ‌రి, రాజే క‌వియైతే క‌వుల సంగ‌తి ఏమి చెప్ప‌వ‌లెను ? ఇదీ నాసంశ‌య‌ము.
సైనికుడు తిరిగి కూర్చుంటూ ప‌క‌ప‌క న‌వ్వినాడు.