గోదావరీ తీర కోనసీమలో, పేరిశాస్త్రి అనే వేదవిదుడు ఉన్నాడు. అతనిది బహు బీదకుటుంబము. మూర్తెప్ప నాయనింవారిని ఆశ్రయిస్తే రాచరికపు కొలువు దొరుకుతుందని విని తంజావూరికి ప్రయాణము కట్టినాడు. తన చిన్న ఇంటిని తమ్మునకిచ్చి వేసి దారిబత్తెమునకుగాను కొలది వస్తువులను మూటగట్టుకొన్నాడు. మూర్తెప్ప నాయనిం వారికి ఇచ్చేందుకు తనవద్ద ఏమియులేదు. శతమానంభవతి అని నెత్తిన చేయి ఉంచి దీవించటం తప్ప తనచేత ఎర్రని ఏగానై నాలేదుకదా అని చింతిస్తూ పెరటిలో చేతులు వెనుకకు కట్టుకొని తిరుగుతుండగా నేలను చీల్చుగొని రెండు ఆకుపచ్చని కత్తులవంటి ఆకులు వస్తూ కనిపించినాయి. దగ్గరకుపోయి చూచినాడు. అమలాపురం జమీందారు కుమార్తె వివాహం సందర్భంలో పండిత సంభావన చేస్తూ ఒక వెండి వరహాతోపాటు నారికేశ ఫలాన్ని కూడా దయచేసినారు. ఇంటికి వచ్చి గడమంచికింద పెట్టబోతూ చూశారు, అప్పటికి అక్కడ ఇలా పోగయిన కొబ్బరి ఫలాలు చాలానే ఉన్నాయి. పేరిశాస్త్రి మంచినిండుగా తీరుగా ఉన్న ఈ కాయను, లోతుగా గోయి త్రవ్వి పాతి పెట్టినాడు. ఆ పాతిన సంగతి మరి గుర్తునకు రానేలేదు. ఈ రెండాకులు ఆనాటి సంగతిని జ్ఞప్తికి తేవడమే గాక మూర్తెప్ప నాయంని వారికి గల వృక్షప్రియత్వాన్ని కూడా వెన్నుతట్టి చెప్పినాయి.
పేరి శాస్త్రి కొబ్బరాకులతో చక్కని చిక్కని బుట్ట అల్లి, విత్తనము మట్టితో సహా పెళ్ళగించి, ఆ కొబ్బరిచెట్టును ఈ బుట్టలో పెట్టుకొని ప్రయాణము సాగించినాడు. మిగిలిన సామానంతా ఒక ఎత్తూ ఈ కొబ్బరి మొక్క ఒక్కటీ ఒక యెత్తూ, దీనిని మోసుకొని రావడం చాలా కష్టమైపోయింది. అతని భార్య దారిపొడుగునా, ఈ మొక్క బతికేనా, చచ్చేనా, గాడిద బరువు ఎందుకు మోస్తారు. అవతల పారెయ్యండి అంటూ ఒకే నస పెట్టింది. మూర్తెప్పనాయనికాలేత మొక్కని బహుకరిస్తూ అది తేవడానికి ఎంత కష్టపడినాడో పేరిశాస్త్రి చెపుతూ ఉంటే, మూర్తెప్పనాయనిం వారి కనులు చెమరించినవి. క్షణమాలస్యము చేయకుండా హుటాహుటిన రాజపురోహితుని దగ్గరకు ఈతనిని తీసికొనిపోయి కొలువిప్పించినాడు. తరువాత పేరిశాస్త్రి శాస్త్రవైదుష్యానికీ, జ్యోతిషశాస్త్ర పాండిత్యానికి గోవిందదీక్షితులంతటివారు ప్రశంసించినారవని విని సంతసించినాడు.
నాడు నాటిన కొబ్బరి మొక్క రెండు సంవత్సరాలైనా నిండకముందే చెట్టు
నిండుగా గెలలు పుట్టుకొచ్చాయి. అందరూ విరగబడి చూచారు వారి ఆశ్చర్యానికి కారణం ఆ చెట్టుకాయలు. అవి అయిదేళ్ళ పిల్లవాడు కూడా కోయగలంత ఎత్తులో మాత్రమే ఉన్నాయి ! ఈ వార్త విన్న మహారాజు అచ్యుతనాయకులు కూడా ఆత్రుత పట్టలేక వచ్చి చూచి, బావా, ఈ చెట్టు నీ తోటలో ఉండకూడదు. విచిత్రమైన రమ్యమైన వస్తువు ఏదైనా ఉంటే అది రాజులకే చెందాలని నీకు తెలియదా ? అని తెచ్చిపెట్టుకొన్న ఆగ్రహంతో అన్నారు. నిజమే , ఈ సత్యం నాకు తెలియందికాదు. తక్షణం భటులను పంపించి తీసుకొని పోవచ్చును అని మూర్తెప్పనాయకులు ధీమాగా అన్నారు. మూర్తెప్ప నాయనింవారి చిటికెన వ్రేలు పట్టుకొని పెద్ద పెద్ద కనులతో వింతగా అచ్యత నాయనింవారి రత్నాభరణాలని చూస్తున్న నాలుగేండ్ల పసిబాలిక చెంచులక్ష్మి. ఈ చెట్టుమనది. ఈ కాయలు నావి. ఎవరికీ ఇయ్యద్దు అని ఏడుపు సాగించినది. బావమరుదులు ఆ బాల అమాయకత్వానికి నవ్వుకొంటూ, ఒద్దు ఒద్దు ఇయ్యవద్దులే, అమ్మా అని ఓదార్చినారు అచ్యుతనాయనిం వారా గులాబీల ప్రోవునల వోకగా ఎత్తుకొని బుగ్గలు నిమిరి లాలించినారు.
ఇలా మూర్తెప్పనాయనివారి మధువనములోని ప్రతి మొక్క యొక్క కుదుట్లోనూ ఒక్కొక్క గాధ ఉంటుంది. ప్రతిచెట్టు యొక్క బోదెకీ ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి పొదరింటికీ ఒక మైత్రీబంధము ఉంటుంది.
శుకవాణి అప్పుడే కమ్ముకుంటూన్న మేఘాలను చూస్తూ, గూళ్ళకు చేరుకోబోతూ సందడులు చేస్తున్న పక్షుల కిలకిలారావాలు వింటూ కమ్మని సువాసనలను మోసుకొంటూ వస్తూన్న చిరుగాలుల్ని ఆఘ్రణిస్తూ వనంలోకి వచ్చింది. ప్రక్కన తన తోడిబాలలు లేకుండా అలా రావడం ఆమెకిదే ప్రధమం. ఎంతో క్రొత్తగా ఉంది, ఎంతో వింతగా ఉంది. కాని ఏదో స్వేచ్ఛ ! క్షణమొకచోట కాలు నిలపలేకపోయినది.
కొంతసేపు చలువరాతి సోపాసము మీద కూర్చున్నది. కొంతవడి మల్లెతీగలకు పుట్టుకొస్తున్న లేలేత మొగ్గలను తన మునివ్రేళ్ళతో అలవోకగా సవరించినది. పచ్చరా చిలుకతో పంతగించిందొకింత సేపు. ఏమో, ఇప్పుడు నాకూ నీపేరే పెట్టారు గురుదేవులు, గర్వపడకు అంటూ దాని రెక్కలను తడిమింది. మైనాకు వచ్చిన కొత్తమాటలను విన్నది. మైనా, నేనన్నట్లనగలవే ! అని దానికి పాట నేర్పబోయింది. ఏ పాట నేర్పాలి ? అని యోచించి, ఆ ! నీ మొహంలే, ఈ ఒత్తులూ పొల్లలూ నీకేం వస్తాయి ? |