88
 

ఇన్ని కార్య‌ముల‌ను వేయిక‌నుల‌తో క‌నిపెట్టి, స‌త్వ‌ర‌ము పూర్తియ‌గున‌ట్లు ప్ర‌యాస‌ప‌డిన శ్ర‌మ శ‌క్తి దాత‌లంద‌ర‌కు కృత‌జ్ఞ‌త‌ల‌ను అంద‌జేసి కొన్నాడు, ర‌ఘునాథ నాయ‌కుడు.

మూర్తెప్ప నాయ‌కులు ఇందిరామందిర స‌భాప్రాంగ‌ణ‌ము దాటుచుండ‌గా యువ‌రాజులు చెప్పిన మాట‌ల‌ను మ‌ర‌క‌త‌వ‌ల్లికి చెప్పినారు. ఆమె ఆ మాట‌లు విని బెగ్గ‌డిల్లి పోయిన‌ది.

ఇదెక్క‌డి చోద్య‌ము ! వివాహం కాక‌నే రాచ‌న‌గ‌రున‌కు అమ్మాయిని పంపించ‌డ‌మా ? వీలు కాద‌ని మీరు చెప్ప‌నేలేదా ?
అంత‌టి ప్ర‌భువు అలా చెప్పిన‌ప్పుడు ఎలా కాద‌న‌డం ? నాకు నోరు రాలేదు.

ఎలా అంటారు ? ఆ అక్క‌గారంటే భ‌క్తీ, బావ‌గారంటె భ‌య‌మూ, అల్లుడంటే ఆపేక్షానూ ! అన్నీ బాగానే ఉన్నాయిగాని పెళ్ళి కాకుండా పిల్ల‌ను న‌గ‌రులోకి ఎలా పంపేది ? న‌లుగురూ నోళ్ళు నొక్కుకుంటారు. ఇలా చేయ‌డం ఏర‌కంగా చూచినా సిగ్గుచేటుగానే క‌న్పిస్తోంది.

వ‌ల్లీ, ఇలా నాకూ అన్పిస్తోనే ఉంది. అబ్బాయి కూడా వివాహ‌మైనాక‌నే, స‌శాస్త్రీయంగా, గృహ‌ప్ర‌వేశం చేయాల‌నుకొన్నాడ‌ట‌. కాని గోవిందామాత్యులు ఇంకా వివాహ‌నికి కొన్నినాళ్ళు ఆగ‌మ‌ని సెల‌విచ్చార‌ట‌. ఆ మాత్యుల అంగీకారం కాకుండా మ‌హారాజులుగాని, యువ‌ప్ర‌భువుగానీ ఇటు కాలు అటు క‌ద‌ప‌రు. అది శ్రేయ‌స్క‌ర‌మూ కాదు. ఇక మ‌న అమ్మాయి సంగ‌తి మ‌నం కూడా ఆలోచించుకోవాలి. త‌ల్లి గురుదేవుల ద‌గ్గ‌ర విద్యాభ్యాసం ముగిసిన‌ట్లే. ఇక అమ్మ‌ణ్ణికి భ‌ర్త‌యినా, గ‌రువైనా, దైవ‌మైనా, సర్వ‌మూ ర‌ఘునాథ నాయ‌కులే. విద్యాభ్యాసం లేకుండా క్ష‌ణ‌మైనా నిలువ‌లేని తల్లిని పెళ్ళిపేరుతో ఎన్నాళ్ళ‌ని ఆప‌గ‌లుగుతాము ? అంచేత నేను మ‌న చెంచుతల్లిని రాచ‌న‌గ‌రుకు పంపిస్తాన‌ని మాట ఇచ్చాను. ప్ర‌భువు అమ్మాయి కొర‌కు ఎలాంటి మ‌హాభవంతిని నిర్మాణం చేయించినారో చూశావంటే, నువ్వు ఈలాంటి పిచ్చి భ‌యాల‌ను పెట్టుకోవు. ఇందిరామందిరంలోని ముందు భాగ‌ము మాత్ర‌మే రాజుల కొలువు కూట‌ము. దాని వెనుక‌నున్న‌ది కొలువు కూటానికి మ‌రి మూడింతలున్న మ‌హా విశాల‌భ‌వ‌న‌ము. కేవ‌ల‌ము మ‌న శుక‌వాణి దేవి సంగీత‌, నాట్య‌క‌ళా సాధ‌న చేసికొన‌డానికి, మ‌హారాణిలాగ అంగ‌రంగ వైభ‌వంగా నివ‌సించ‌డానికి మాత్ర‌మే అనువుగా ఉండేట‌ట్లు నిర్మాణం చేయించాడు, ర‌ఘునాథుడు.

అన్నీ బాగానే ఉన్న‌వి. అమ్మాయి అదృష్ట‌మూ బాగానే ఉన్న‌ది. అత‌నికి ఆమ్మాయి మీద ఉన్న ప్రేమా బాగానే ఉన్న‌ది. ఎటోచ్చీ పెళ్లి కాకుండా..

ఇక నువ్వామాట అన‌కు దేవీ ! ర‌ఘునాథుడు సాక్షాత్తూ రామ‌చంద్రుని వంటి స‌ద్గుణ సంప‌న్నుడు.చెడుత‌ల‌పులు మ‌న‌సులోనికి రానీయ‌కు. చెంచుల‌క్ష్మి శ్వాశ‌తంగా కీర్తినార్జించ‌కోవాలంటే, ర‌ఘునాథుల శిష్య‌రికాన్ని పెళ్ళి కాకుండానే చేయాలి. వివాహ‌మైనా కూడా విద్యార్థ‌న చేయ‌డం క‌ష్టం క‌దూ ! వివాహానికి ముందున్న నీ క‌ళాసంప‌ద, పాండిత్య ప్ర‌క‌ర్ష ఏమైపోయిన‌వి ? మూల‌గ‌దిలో దాక్కోలేదు ?

మూర్తెప్ప నాయ‌కులు న‌వ్వుతూ ప్ర‌శించినారు.

ఉహూ ! మీరు న‌న్నిలా అన్నారిన నాకు దుఃఖ‌ములేదు. కాని, మీ కుమార్తెకు ఈ విద్య‌ల‌న్నీ నా నుండి వ‌చ్చిన‌వి కావా ?

మ‌ర‌క‌త‌వ‌ల్లి న‌వ్వుతూనే ఎదురుప్ర‌శ్న వేసిన‌ది.

నిజ‌మే ! వివాహ‌మైనాక అన్ని విద్యలూ అణ‌గిపొతున్నాయి కదా ! అందుకే మ‌రికొన్నాళ్ళిలా...

అయ్యో ! ఇదేమిమాట ! విద్య‌ల‌ణ‌గిపోతాని క‌న్న‌బిడ్డ‌కు వివాహం వ‌ద్దంటారా ఏమిటి చివ‌రికి ? !

ఛీ ! ఛీ ! అశుభం ప‌ల‌క‌కు. పెళ్ళికి కొంత‌వ్య‌వ‌ధి ఉండాల‌ని అన్నాను గాని అస‌లే వద్ద‌న‌లేదు క‌దా ?

స‌రే మీ ఇష్ట‌ము. అయినా చిట్టి తల్లిని చూడ‌కుండా ఎలా బ్ర‌తికేది ?

అత్త‌వారింటికి పంప‌వా ?

అది పెండ్ల‌యిన‌ప్ప‌టి మాట !