ప్రభువులు, నటియించవె, అని ప్రయెగించినారా ! ఈలాగున పలకరించడం ఇది రెండవసారి. ఓసి చెంచితా అని మొన్ననా, నటి యించవె అని నేడా ? శుకవాణి యోయనను గ్రహించిన ప్రభువులు నవ్వుకొన్నారు.
కావ్యనాయిక ఖండింతగాని విప్రలబ్దగాని కలహాంతరితగాని అయిన తావున నృత్యము నిషిద్ధము. శుకవాణీ ! దైవస్తుతి సందర్భమున ఛందో సంబంధియగు గీతాంగమునందు ఉద్ధతమైన నృత్తమును ప్రదర్శించవలెను సుమా ! ఇప్పట్టున విద్యుద్ర్భాంతము, గరుడుప్లుతకము మొదలైన మహేశ్వర అంగహారములచేత వృత్తమును ప్రదర్శించుట శ్రేష్ఠతమము.
సుకుమార వృత్తమెపుడు ఔచిత్యదాయకమో తెలియునా ? నీవిపుడు దానిని అభినయింపవచ్చును. శృంగార సంబంధి అయిన సల్లాపమందు ప్రయోక్తమైన నృత్తమును సుకుమార నృత్తమంటారు. చిదంబర ఆలయగోపుర కుడ్యాలపై శిల్పించిన నూట ఎనిమిది కరణములను చూచినావా ?
లేదు, ప్రభూ ! చిదంబర నటేశ్వరుని చూచుట కెన్ని మారులోపయనమైనాముకాని ఏవియో ఆటంకములచేత వెళ్ళుటకు వలనుపడలేదు.
ఎందుచేత ఆటంకములు కలిగినవో తెలియునా ? ఆ నటరాజస్వామి చెంతకు మనమిరువురము కలసివెళ్ళి సేవించవలసి యున్నదేమో ! గంగావ తరణము, నాగాపసర్పితము, శకటాస్యము, మయూర లలితము మొదలైన కరణములు చాల కష్టసాధ్యములు. శరీరమెంతయో స్వాధీనముకావలయును. ఎటు త్రిప్పిన ఆటు తిరుగునట్లు మైనపుముద్దలా దేహము వశీకృతము కావలసి యున్నది.
చిదంబర దేవాలయముపైన నూట ఎనిమిది కరణములకు లక్ష్యముగ స్త్రీమూర్తి శిల్పింపబడియుండగా కంచిలోని కైలాసనాధ దేవళమందు పురుషమూర్తి శిల్పింపబడియుండెను. భక్తికీ కేంద్రస్థానాలైన దేవశాలలో కూడా కళాసౌందర్యం మహోన్నత స్థానంలో ప్రతిష్టింపబడి ఉన్నది. భక్తికి కళకూ అవినాభావ సంబంధము సనాతన కాలం నుండి హైందవులకు పరం పరానుగతంగా వస్తూనే ఉన్నది.
ఈ గాంధర్వ నాట్యశిల్ప, చిత్రలేఖ నాది సర్వకళలకూ మూలపదార్ధము భగవద్భక్తియే. ఈ కళలు ఆత్మ అనే కోశాగారపు బంగరు తలుపులను తెలవగలిగే తాళపు చెవులవంటివి. విశ్వాత్మకుడైన జగన్నాథుని, చర్మ చక్షువులకు గోచరింపజేసే జ్ఞానాంజనమే కళ. ఎవరైతే జీవనసత్యాన్ని హృద్గతం చేసికొని చిత్తమును ఏకాగ్రముగ, ఏకోస్ముఖముగ నియమింపగలరో, ఎవ్వరి భావము దేహాన్ని, మనసును, ప్రాణమును, అతిక్రమించి, ప్రేమరసమున దోగాడి పారవశ్యమునందగలరో వారే కళావిదులు, వారే రసస్రష్టలు, వారే కావ్యనిర్మాణ సుదక్షులు, వారే గాయకులు వారే నిజమైన శారదాదేవి ముద్దుబిడ్డలు. శుకవాణీ ! సర్వేంద్రియాలూ, మనస్సు, బుద్ధి చిత్తము, అంతఃకరణము సమస్తములున్నూ ఏకమై ఒకే వాంఛను అభిలషించినపుడే, ఆనాడు నీవు చెప్పిన దివ్యప్రణయాన్ని కవి సృష్టించగలుగుతాడు. అంతేగాని చంద్రుడు, వెన్నెల, అంగసౌష్ఠవము, విరహాము మొదలైన బహిరుపాంగ చిత్రణము ఎంత చేసినప్పటికినీ ఆడంబరంగా ఉంటుందేతప్ప ఆత్మానందకరంగా ఉండదు.
స్వామీ ! మనము నాట్యపాఠము నుండి కావ్యరస చర్చలోనికి మరలినట్లున్నాము.
వాణీ ! నన్ను చెప్పనీ. నీ కనులలోనికి నేను చూచినప్పుడు నాలో కలిగే ప్రణయావేశానికి నన్నే భాష్యం చెప్పుకోనీ.
రఘునాథ నాయకుల ఉద్విగ్న ప్రకృతిని చూచి శుకవాణీ చకితయైనది.
ప్రభూ ! స్త్రీ పురుషులలో ఏ ఒక్కరికో ప్రణయభావము ఉత్పన్నమై రెండవవారి యందు ప్రణయరాహిత్యము ఉన్నప్పుడు, ఆ ప్రణయాన్ని దివ్య ప్రణయము అనవచ్చునా ?
వాణీ ! రెండు చేతులు కలిస్తేనే శబ్దం పుట్టేందుకు అవకాశం ఉంటుంది. రెండు హృదయాలు కలిస్తే పుట్టేదానిని మాత్రమే ప్రణయమన వలెనుగనా ఏకహృదయ జన్యమైనదానిని ప్రణయమనరాదు. విత్తు భూమిలో నాటినప్పుడు భూమీ నీరూ కలిసి మొలక బయటకు వచ్చేటందుకు ఎట్లు ప్రయోజనకారులవుతాయో, అట్లే ప్రేమవృక్షం పెరిగేటందుకు రెండు హృదయాలూ తోడ్పడవలసినదే. ఏకపక్షం అయినట్లయితే మొలకమారాకు వేయకుండానే మాడిపోవచ్చును. ఇక, శృంగార రసప్రాశస్త్యాన్ని తెలిసికోవలసిన అవసరం నీకు ఉన్నదా ?
వ్రీడాభారంతో శుకవాణి కనులు సోగలై క్రిందిచూపులు చూస్తున్నవి. |