శృంగార, వీర, రౌద్రములు మిక్కిలి ఔచిత్యముగ పోషింపబడినవి అనినారు.
కృష్ణాధ్వరి : ప్రభూ ! గ్రంధాదినే ఒక అనౌచిత్య దోషం కన్పిస్తూ ఉన్నది.
అచ్యుత : ఏమది ? వివరించు, కవీ !
కృష్ణాధ్వరి : చిత్తం, ప్రభూ ! కావ్యము విఘ్నేశ్వరుని బాల్యలీలలతో ప్రారంభమైనది. తదుపరి దక్షయజ్ఞము. యజ్ఞద్వంసము మొదలైన విషయములు వివరించబడినవి. విఘ్నేశ్వరుడు పార్వతీదేవి పుత్రుడు. దక్షయజ్ఞ సమయానికి పార్వతీదేవియే జనించలేదు. ఇక గణేశ్వరుని బాల్యవర్ణనము ఏ విధముగ ఔచిత్యమో !
చౌడప్ప : కృష్ణాధ్వర కవీ, ఈ గ్రంధారంభాన క్రీడించిన విఘ్నేశ్వరుడు, పార్వతీదేవికి జన్మించిన విఘ్నేశ్వరునకు తాతవరుస అనుకొంటను తాతపేరే పార్వతీదేవి తన కుమారునకు పెట్టుకొన్నది. నీవు ఈతడే అతడనుకొని భ్రమపడినట్లున్నావు !
సభలో నవ్వులపువ్వులు వెల్లివిరిసినవి. మహారాజులు చౌడప్ప కొంటెతనానికి ముసిముసిగ నవ్వుకొనిరి.
మురారి : మన పురాణాలలోని పురుషులకూ వాటిలోని గాధలకూ తరచి చూస్తే సంబంధమంతగా కానరాకుండా ఉండునని అందరకూ తెలిసిన విషయమే. ఇటు లక్ష్మీపుత్రుడైన మన్మధుడు పుట్టకమునుపే తండ్రిపై పూలబాణాలు వేస్తాడు. అటు శివుడు సతీవియోగంతో తపస్సు చేసికొనేముందు విఘ్నేశ్వర పూజ చేస్తాడు. పుత్రుల విషయంలో మాత్రము శైవవైష్ణవ భేదం లేకుండా ఇరువురూ సమంగానే ఉన్నారు. ఇలాంటి విషయాలను కవిసమయాలు అనుకోవాలి.
రత్నభేట : మురారి పండితులు చెప్పినది ఉచితంగా ఉన్నది. కాని ఈ కావ్య విషయంలో ఇంకొక అంతరార్ధం ఉన్నది. ప్రారంభశ్లోకంలో కావ్యకర్త గం అనే అక్షరాన్ని ముమ్మారు ప్రయోగించినారు. ఈ గం అక్షరము మూలాధార చక్రపాలకుడైన గణేశ్వరునికి బీజాక్షరమై మంత్రతుల్యంగా విలసిల్లినది. శ్రధ్ధగా పరిశీలిస్తే షడాశ్వాస పర్యంతమైన ఈ గ్రంధంలోని ప్రతి అశ్వాసంలోని తొలి శ్లోకమూ ఆయా చక్రబీజాక్షరాలతో షట్చక్ర నిరూపితమై ఉండటం గమనింపవచ్చును. మరియు కుమారుడు షడాననుడు.
ఈ అశ్వాసములు కుమారుని శిరములవంటివి. అనంత విరహానుభూతిని అనుభవించిన తరువాత సహస్రార చక్రాన లభించిన అమృతం వలె, పార్వతీదేవి రాక్షస సంహారార్ధం కుమారుని గన్నది. సతీ పరమేశ్వరులు, పార్వతీ పరమేశ్వరులు దాంపత్యం దివ్యప్రేమగా విరచితమైనది. ఇందలి శైలి కాళిదాస భవభూతల అపూర్వశైలీ సంగమం. శివుడు తన పుత్రుని తల నరకి, ఏనుగు తల తెగకోసి తెచ్చి అమర్చిన ఉదంతంలోని దోషాలను పరిహరిస్తూ చేసిన ఇందలి కల్పన, సతీదేవి పరమేశ్వరులు గజరూపాల క్రీడించి గజాననునికి జన్మ ఇచ్చినారన్న ఉదంతం మహోత్తమంగానూ, హృదయంగమం గానూ ఉన్నది. జగన్మాతయైన పార్వతీదేవి హృదయం ఎంతో చల్లనైనదని చెపుతూ, హిమంతుని కుమార్తెకుగాక ఆ చల్లదనం మరి యెకరియందు ఎందుకుంటుంది అని అలంకరించడం బహు ప్రశస్తంగా ఉన్నది. శివధర్మోత్తర గ్రంధమును, కాళిదాసుని కుమార సంభవము లోని సుందర భావాలను కావ్యనిర్మాత స్వీకరించి స్వయం ప్రతిభ అనే ఆత్మలక్షణంతో వన్నెలు చిన్నెలు సృష్టించినారు. ఉద్భటుని కుమార సంభవములో ఉన్న హరలీలలను వీరశివ లీలలుగాగాక సుందర శివలీలలుగా మలచినారు.
రత్నభేట శ్రీనివాస దీక్షితులవారి మాటలు సభికులు మంత్రముగ్ధులులా వింటూ వున్నారు.
అచ్యుత : కావున, ఈ గ్రంథమును చూడగా తత్కర్తకు ప్రతిభవ్యుత్పత్తులు రెండున్నూ ఉన్నవని పండిత ప్రకాండులందరు అంగీకరించి నట్లేనా ?
చిత్తం ! చిత్తం ! అందులకు సందేహంలేదు, ప్రభూ ! రచయిత నామధేయమేదయో ? ఇప్పటికైనా మా ఉత్కంఠను తీర్చరా ?
అచ్యుత : మరి మూన్నాళ్ళు ఓరిమి వహించమని వినతి. ఇందిరామందిరంలో కావ్యకర్త నామధేయమేగాదు, కావ్యకర్తనే మీరు స్వయంగా చూతురుగాని.
నాటికి సభ చాలించిరి.
ఇందిరామందిరము చిత్రవిచిత్రముగా అలంకిరంపబడినది. చూతతోరణాలు, పుష్పతోరణాలు, రత్నతోరణాలు శోభాయమానంగా ఉన్నవి. అంతఃపుర స్త్రీలు అధివసించి ఉన్న ఆసనాలకు సన్నని పట్టుతెర కట్టబడి ఉన్నప్పటికి, వారలంకరించుకొన్న అమూల్యాభారణాల కాంతికిరణాలు, నీలి మబ్బులను ఛేదించుకొంటూ ప్రకాసిస్తున్న తరుణబాలుని నునులేత కిరణాలవలె మెరుములీనుతున్నవి. పురప్రముఖులనేకులు ఆహ్వానింపబడినారు. సేనాధ్యక్షులు మూర్తెప్ప నాయకులవారు మరకతవల్లీదేవి సమేతులై వచ్చి ఉచితాసనాల నధివసించినారు. |