మహారాజుల మహారాణుల స్వర్ణసింహాసనాలకు దిగువగానున్న రజిత సింహాసనాన, రఘునాథ యువప్రభువులు, వారికి ఇరుప్రక్కలా కళావతీదేవి, లక్ష్మీదేవి యువరాణులు ఆశీనులై ఉన్నారు. మహారాజుల సింహాసనానికి వామభాగాన అమాత్యులు గోవిందయజ్వలవారు ఆశీనులైరి.
ఆస్థానకవులు చేమకూర వేంకటకవి, రాజ చూడామణి దీక్షితులు, కృష్ణాధ్వరి ప్రభృతులునూ, మధురా పట్టణమునుండి అప్పయ్య దీక్షితుని భ్రాతృఔరసుడున్నూ తనకు దత్తపుత్రుడున్నూ అయిన నీలకంఠ దీక్షితులున్నూ, జింజి ఆస్థాన పండితులు రత్నభేట శ్రీనివాస దీక్షితులున్నూ, చంద్రగిరి నుండి అర్ధనారీశ్వర దీక్షితులున్నూ, వేలూరు నుండి కేశవ పరివ్రాజకులున్నూ సముచితాసనాల నధివసించిరి.
శ్రీశ్రీశ్రీ చోళమహామండలేశ్వర, సకల సామ్రాజ్య ధౌరేయ, నిరంతర నారాయణ మంత్ర జపశోషితాకార, పురాణతత్త్వ విచార, శివ వైష్ణవాద్వైతాది షణ్మత సిద్ధాంతజ్ఞాన తత్పర, సర్వమతరక్షణ దీక్షాకంకణ బద్దశోభితకర. శ్రీశ్రీశ్రీ అచ్యుతనాయక భూవర, బహుపరాక్ ! బహుపరాక్ ! అనుచు వెండి బెత్తములవారు, చామరగ్రాహిణులు బిరుదులు పఠించుచు వెంటరాగా, మూర్తిమాంబా మహారాణి సమేతులై, విచ్చేసి సింహాసనాశీనులైరి మహారాజులు ఇందిరామందిర సభను అలంకరించడమనేది బహుసకృత్తు, మహారాజులను కనులారా చూచుకొంటూ కవి, పండిత, నగర ప్రముఖులు, సామాన్య ప్రజానీకము మహానంద పరవశులయిరి.
ఆస్థానకవుల ఆసనముల చెంతనున్న రెండు సమున్నతాసనములపై, పరిచారికలు వెంటరాగా మందగమనాన వచ్చి ఆశీనులైన శుకవాణి, రామభద్రా దేవులను ఆహుతులు ఆశ్చర్యచకితులై, కనులు పెద్దవి చేసికొని దీక్షగా పరికించసాగిరి. యువప్రభువు రఘునాధ నాయనిం వారు,తమ తండ్రిగారు తమకీ విషయము తెలియనీయక గోప్యపరుచుటలోని చమత్కారమునకు చిత్రమంది, మదినిండ పట్టరాని ఆనందానుభూతిని పొందినారు.
యజ్ఞనారాయణ దీక్షితులవారు శుకవాణి, రామభద్రల ప్రతిభాపాట వాదులను గూర్చి సభకు నివేదనను మొనర్చినారు. కుమారసంభం గ్రంధమును మహానుభావులందరు ప్రశంసించుటకు ప్రస్తావించినారు. ఆ గ్రంధ రచయిత్రి శుకవాణి దేవిని సభకు ఎరుకపర్చినారు.
యజ్ఞనారాయణుని మాటలు విని, ఇందిరామందిరము విస్తుపోయినది. ఉర్రూతలూగినది. మహాకవులు, మహాపండితులు అబ్బురపడిరి. ఈ చిరుత ప్రాయపు చిన్ని బాలికా ఇంతటి మహా ఉద్గ్రంధమునకు కర్త ! శుకవాణి దేవికి గల మహాధారణ శక్తిని గురించి తెలిసికొని, ప్రముఖులు ఆమె ప్రతిభాచాతుర్యములను ఎరుగగోరి సంస్కృత భాషలో ఒక సమస్యనిచ్చి పూరింపుమనిరది.
కలారత్నం గీతం గగన తలరత్నం దినమణిః అని ప్రధమ పాదాన్ని ఇచ్చినారు.
శుకవాణి దేవి వెంటనే అశువుగా,
కలారత్నం గీతం గగనతలరత్నం దినమణిః
సభారత్నం విద్వాన్ శ్రవణపుట రత్నం హరికధా
నిశారత్నం చంద్రః శయనతల రత్నం శశిముఖీ
మహీరత్నం శ్రీ మజ్జయతి రఘునాధో నృపవరః అని పూరించినది.
శుకవాణిదేవి గొంతు నుండి వెలువడిన మధురగాన్నాన్ని విని శ్రోతలు మంత్రముగ్ధులైరి. కవిప్రకాండులు, శాస్త్రజ్ఞులు, భళీ, భళీ యిని మెచ్చుకొనిరి. రఘునాధుల గుండెలో సంతసం కడలిలా పొంగిపొరలినది. మహారాజులు శ్రీశ్రీశ్రీ అచ్యుత నాయనిం వారికి ఆమె సమయస్ఫూర్తికేగాక యువ ప్రభువుయెడ ఆమె ప్రదర్శించిన గాఢభక్తిని చూచి మురిపెము కల్గినది. కొందరు, మహారాజులను వదలి యువరాజులను మహీరత్నం అని కీర్తించడాన్ని గూర్చి గుసగుసలు పోయిరి. మహారాజులీ భావమును గ్రహించిన వారై, తామే స్వయముగా శ్లోకార్ధమును సమర్ధించిరి.
ఈ అచ్యుతనాయకులు మహారత్న మేగాని వృద్ధాప్యముచేత కొడిగట్టిన దీపమైనాడు. వర్ధమాన సూర్యుడైన రఘునాథుడు గగనతల రత్నమైన దినమణితో దీటుగా ప్రకాశించిగలడు. కవయిత్రి ఔచాత్యాన్ని చక్కగా పోషించడమేగాక నిర్భయంగా యధార్ధాన్ని వచించినందులకు నేను పరవశుడనైతిని. మహారాజుల గంభీర వచనాలతో అందరి శంకలూ తీరినవి. |