శ్రీ మహారాజులు వేంకటమఖి సహాకారముతో నూతనమైన వీణనను సృష్టిచేసిరి. తళుకు నీలపుటద్దములె నీడలు కనుపించు తుంబీఫలము, రతనాల పూసల రాజిల్లెడు సిరాజి పగడంపు మెట్లు, ప్రచురరాగలతాంకురములు ప్రాకుచున్నట్లు తంత్రీసౌందర్యము, పట్టుజరీ వస్త్రమును కప్పితెచ్చిన ఆ వల్లకీబాలను ఇందుముఖులిరువురు కలసి తెచ్చి శారదాదేవి ముంగిట ఉంచిరి. అర్చకులు శారదాదేవికిన్నీ, వీణాదేవికిన్నీ అర్చనలు చేసిరి. రఘునాథ నాయక మహాప్రభువులా వీణాదేవిని శుకవాణిదేవి చేతనుంచిరి.
శుకవాణిదేవి వీణాసన మధివసించి, అత్యంత ప్రేమతో ఆ వీణియను వడిలోనికి తీసుకొని అలవోకగా మీటినది. ఇది దివ్యవీణ. రాగము మార్చినపుడల్ల మేళమును మార్చనవసరము లేదు. ఇంత చక్కని రఘునాథ భూపాల వీణియను శుకవాణీదేవి తన వడిలో ఆప్యాయముగా పొదుపుకొన్నది. సింహకరాళ శిరమును నిమిరినది దంతధావళ్యకాంతుల కానందించినది. పుష్ప సౌందర్య శిల్ప విన్యాసములను తిలకిస్తూ, జయంత సేనరాగాన శారదాదేవిని కీర్తిస్తూ వీణా వాదనమును చేయ మొదలిడినది. ఈ రాగమును సృష్టించిన బ్రహ్మ, రఘునాథ నాయనిం వారే. ఆయన ముదముమీర, కౌతుహలాన ముందునకు వంగి శ్రవణములనే కాగ్రముచేసిరి.
స్వర ప్రస్తారము రాగవికాసము, లయవిభూతి, ఆనందము అనే అమృతఝరులు నాలుగు తీవెలనుండి నిర్గమించి శ్రోత్రృ హృదయాల నార్ద్రపరచు చున్నవి.
శారదాధనము, నా తంజపురీ పట్టణాన శ్రీశ్రీశ్రీ రఘునాథ నాయక మహారాజులు మహావైభవోపేతంగా చేసిరి. ఆ దేవికి నిత్యదీప ధూపారాధనలు, సంగీత నాట్యాంజలులు, ఉద్గ్రంధ మహా నివేదనాలు జరుగుతూనే ఉన్నవి.
చతుర్ధ సర్గము
వాజసనేయము
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః
భద్రం పశ్యే మాక్ష భిర్య జత్రాః
బృహజ్జగదీశ్వర నటరాజమూర్తి జటాజూటాగ్రన కులుకులొలుకు సుందర మందాకినీ దేవి పరమశివాభరణంగా విలసిల్లే ఖండచంద్రుని ధవళ కిరణ ప్రభలు ప్రతిబింబిస్తూ ఉండగా చాందినీ వెలుగులను వెంట నిడుకొని దక్షిణ పినాకినియై తంజధరాధిదేవిని తన అనంత బాహువులతో పొదువుకొని అమృతోపమైన తీయని నీరములతో పరిప్లాలిత మొనర్చుచూ ఉండెను. చోళమండలమున ఎక్కడ చూచినా కడుపు నిండుగా పండించుకొని, గర్భభారానకు ఒరిగి ఒయారాలు పోతూ ఉన్న ధాన్యలక్ష్మీ శృంగార వనాలే ! నిండుగా పూచిన పుష్పగుచ్ఛాలతొ పండిన ఫలరాజాలతో చిరుగాలికి దోగాడే వృక్షరాజాలే ! తమ ఘర్మ జలాలతో భూదేవికి సేవచేసికొన్న భూమిపుత్రుల ఇంటి ముంగిళ్ళలో రాసులు పోసిన శాలిధాన్యాలే ! ఇల్లాళ్ళ నగుమోములలో దారిద్ర్యరేఖ పొడసూపని నిత్య సంతృప్త లాస్య విన్యాసాలే !
ఉత్తరాన పెన్నేరు, దక్షిణాన పాండ్య భూమండలము, పశ్చిమాన చేర చాళుక్య రాజ్యాలు, తూర్పున రస సింధువు. ఎల్లలేమైననేమి ? దిక్కులేమైననేమి ? ఏకామ్రేశ్వర సహిత కామాక్షిదేవి అమ్మారున్నూ, శ్రీరంగేశుడై అవతరించిన వటపత్రశాయిన్నీ, రావణ వధానంతర రామప్రతిష్టాపిత శ్రీ రామలింగేశ్వరమూర్తిన్నీ, మధుర పాలకుల ఇంటి ఆడపడుచు సుందరేశ్వర సహిత మీనాక్షి అమ్మవారున్నూ, సప్తశైలాలపై వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారున్నూ అహోరాత్రములు తంజపురినీ, ఆ పురాధీశ్వరులనూ, పురప్రజలనూ తన సహస్రాక్షములతో పరిరక్షిస్తూ ఉండగా దేశము శాంతి భద్రలతో పరమ ప్రశాంతముగ, సుభిక్షముగ నున్నది. లక్ష్మీ సరస్వతులు ఆనంద నాట్యం చేస్తూ ఉండిరి. |